హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): విద్యాలయాల్లో డ్రగ్స్ కట్టడికి తెలంగాణ సర్కారు సరికొత్త వ్యూహంతో ముందుకెళుతుంది. పాఠశాలల్లో డ్రగ్స్‌ను అరికట్టేందుకు ప్రహరీ క్లబ్‌లను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం శనివారం జీవో -20ని జారీచేశారు. తల్లిదండ్రులు, పోలీసులు, ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు గల విద్యార్థులతో కలిసి ఈ క్లబ్‌ను ఏర్పాటు చేస్తారు.
హెచ్ఎం, ప్రిన్సిపాల్ క్లబ్‌కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఉపాధ్యక్షుడిగా సీనియర్ టీచర్ లేదా చైల్డ్ ఫ్రెండ్లీ టీచర్ ఉంటారు. 6 నుంచి 10వ తరగతి వరకు క్లాసుకు ఇద్దరు చొప్పున విద్యార్థులుంటారు. పేరెంట్ టీచర్ అసొసియేషన్ నుంచి ఒకరు ప్రతినిధిగా, పోలీస్‌స్టేషన్ నుంచి ఒకరు సభ్యుడిగా ఉంటారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో పోలీసుశాఖ, ఎన్ఎస్ఎస్ వలంటీర్ల సహకారం తీసుకోవాలని సూచించారు.