యాదగిరిగుట్ట/మల్యాల/మొయినాబాద్, జూలై 21 : రాష్ట్రంలో సమృద్ధిగా వానలు కురవాలని కోరుతూ పలు ప్రాంతాల్లో మంగళవారం వరుణ యాగాలు నిర్వహించారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో ‘వర్ష పాశుపత వరుణ యాగం’ శాస్ర్తోక్తంగా సాగింది. ఈ యాగంలో ఈవో భవానీ శంకర్, శివాలయ ప్రధాన పూజారి గౌరీభట్ల సత్యనారాయణ శర్మ, ప్రధానార్చకులు గౌరీభట్ల నరసింహరాములు శర్మ, ఏఈవో దొమ్మాట సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులోని ఆంజనేయస్వామి సన్నిధానంలో దే వాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ‘వరుణయాగం-వరుణహోమం’ నిర్వహించా రు. వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వానలు కురువాలని శ్రీ ఆంజనేయస్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. పుష్కరిణిలో వరుణజపం- వరుణహోమం, పూర్ణాహుతి చేపట్టారు. కార్యక్రమంలో ఈవో అంజనారెడ్డి, ఏఈవో హరిహరనాథ్, పర్యవేక్షకులు చంద్రశేఖర్, సునీల్‌గౌడ్ పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు గండిపేట జలాశయంలో వరుణ జపం చేశారు. ప్రధాన అర్చకులు లక్ష్మీనర్సింహస్వామి నేతృత్వంలో అర్చకులు రంగరాజన్, వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య వరుణ పూజలు చేశారు.