హైదరాబాద్, మే 9(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రిగా పాలనలో విఫలమైన రేవంత్‌రెడ్డి.. హోం మంత్రిగా ఘోరంగా ఫెయిలయ్యారని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ సబితా ఇంద్రారెడ్డి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించి, హైదరాబాద్ క్రైమ్ హబ్‌గా మారిందని విమర్శించారు.
‘కేసీఆర్ పదేండ్ల పాలనలో ఐటీ హబ్‌గా రూపుదిద్దుకున్న హైదరాబాద్.. రేవంత్‌రెడ్డి రెండున్నరేండ్ల్ల పాలనలో క్రైమ్ హబ్‌గా రూపాంతరం చెందింది.. రాష్ట్రంలో 18.4శాతం నేరాలు పెరిగాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా విడుదల చేసిన నివేదికే ఇందుకు సజీవసాక్ష్యం’ అని తీవ్రస్థాయిలో ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్లో ఆమె విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ కట్టించిన కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చుంటున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఏనాడూ సమీక్షించకపోవడం విడ్డూరమని, లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకనే పరిశ్రమలు వెనక్కిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు.
శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థను రాజకీయ కక్షసాధింపు చర్యలకు వినియోగించడం వల్లే రాష్ట్రంలో దారుణాలు జరుగుతున్నాయని సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్, కరీంనగర్, హుజూరాబాద్, మల్కాజిగిరి ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసులపై దాడులకు దిగి ధ్వంసం చేయడం దురదృష్టకరమని మండిపడ్డారు. ఈ ఘటనలకు కారకులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ రెచ్చగొట్టేలా మాట్లాడడం వల్లే ఈ దాడులు జరిగాయని ఆరోపించారు.
కేసీఆర్ పాలనలో హోం శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో పోలీసులు చలాన్లకే పరిమితమయ్యారని ఎద్దేవాచేశారు. మహిళల భద్రత కోసం షీటీమ్స్‌ను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి పాలనలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇటీవల అర్ధరాత్రి గస్తీకి వెళ్లిన మల్కాజిగిరి మహిళా ఐపీఎస్ అధికారిపై పోకిరీల వేధింపులే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. 2023తో పోల్చితే 2024లో 34 వేల కేసులు పెరుగడం, మహిళలపై అఘాయిత్యాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలువడం కాంగ్రెస్ ప్రభుత్వం భద్రతా వైఫల్యానికి అద్దంపడుతున్నదని విమర్శించారు.
బండి సంజయ్ కొడుకుపై నమోదైన పోక్సో కేసుపై విచారణ జరుపాలని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. తప్పు చేయనిదే కేసు నమోదు కాదు అని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించి వాస్తవాలు వెలికితీయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ఆందోళన వ్యక్తం చేశారు. పట్టపగలే హైదరాబాద్‌లో నేరాలు, ఘోరాలు జరుగుతున్నా నిలువరించలేని పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. లా అండ్ ఆర్డర్‌ను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. విద్యారంగంలోనూ అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు రద్దు నిర్ణయంపై పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు.