హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా లోకాన్ని ఘోరంగా వంచించిందని మాజీ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామంటూ పరేడ్గ్రౌండ్స్ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పిన మాటలు ఈ శతాబ్దపు అతిపెద్ద అబద్ధమని విమర్శించారు. ప్రసంగాల్లో స్వర్గం చూపించి, ఆచరణలో శూన్యాన్ని మిగల్చడం కాంగ్రెస్కు అలవాటుగా మారిందని మంగళవారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు.
ఎన్నికల ముందు ప్రతి మహిళకూ నెలకు రూ.2,500 ఇస్తామని అడ్డగోలు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చి మూడేండ్లు అవుతున్నా ఒక రూపాయి అకౌంట్లలో వేయలేదని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద రూ.1,00,116లను క్రమం తప్పకుండా ఇస్తే.. కాంగ్రెస్ దానికి అదనంగా తులం బంగారం ఇస్తామని ఆశ చూపిందని పేర్కొన్నారు. ఇప్పుడు బంగారం దేవుడెరుగు, పాత కల్యాణలక్ష్మీ డబ్బులు కూడా రాక పేదింటి ఆడపిల్లల తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ పథకాలను రాజకీయ కక్షతో అటకెకించారని సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. కొత్త బస్సులు కొనకుండా ఉచిత ప్రయాణం అనడంతో సీట్లు దొరక కాలేజీ విద్యార్థినులు, ఉద్యోగినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గంటల తరబడి రోడ్లపై నిలబడాల్సి వస్తున్నదని ఆరోపించారు. మహిళలకు ఉచితం అంటూనే ఇంట్లోని మగవారికి టికెట్ ధరలు పెంచడం ప్రభుత్వ ద్వంద్వ నీతికి నిదర్శనమని మండిపడ్డారు. కాలేజీ అమ్మాయిలకు ఎలక్ట్రిక్ సూటీలు, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఒంటరి మహిళల పింఛన్ల హామీలన్నీ గాల్లోనే కలిసిపోయాయని ఎద్దేవా చేశారు.