వికారాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసే వరకు ఉద్యమిస్తామని మాజీ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పాలమూరు ఎత్తిపోతలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు జరుగుతున్న అన్యాయాన్ని కేసీఆర్ ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సింది పోయి విషయాన్ని పక్కదారి పట్టించేందుకు రేవంత్‌రెడ్డి వ్యక్తిగత దూషణలకు దిగారని మండిపడ్డారు. ఏదీఏమైనా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రైతాంగానికి సాగు నీరు అందించాల్సిందేనని డిమాండ్ చేశారు.
పాలమూరు ఎత్తిపోతలకు 90 టీఎంసీలకు కేటాయిస్తే 45 టీఎంసీలు ఎందుకు అడిగారని, దాని వెనుక ఎవరున్నారని కేసీఆర్ అడిగితే, సమాధానం చెప్పకుండా సీఎం పదవికి కళంకం వచ్చేలా రేవంత్‌రెడ్డి మాట్లాడారని మండిపడ్డారు. పదేండ్లలో పాలమూరు ఎత్తిపోతలపై కాంగ్రెస్ నాయకులు వేసిన కేసులతో సగం కాలం పూర్తయ్యిందని, 90 శాతం పనులు పూర్తయిన తర్వాత కూడా మిగతా 10 శాతం పనులు పూర్తి చేసి ఈ ప్రాంత రైతులకు సాగునీరిచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయలేదని ప్రశ్నించారు. 90 శాతం పనులు పూర్తయి, కాలువల నిర్మాణం కోసం టెండర్లు చేపట్టిన తర్వాత ఎందుకు రద్దు చేశారని అడిగారు. కనీసం కాలువలు పూర్తి చేస్తే గ్రావిటీ మీద పరిగి నియోజకవర్గానికి సాగునీళ్లొచ్చేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై చేస్తున్న కుట్రలన్నీ ప్రజలందరికీ తెలిసేలా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని మండల కేంద్రాల్లో, గ్రామాల్లో కరపత్రాలను పంపిణీ చేసి, అవసరమైతే ఒకరోజు దీక్షలు చేపడుతామని తెలిపారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఎలా పక్కకు పడేసిండ్రు అనే విషయాన్ని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ఈ మధ్య చెక్‌డ్యామ్‌ల పేల్చివేత ఘటనలు జరుగుతున్నాయని, కాళేశ్వరం ప్రాజెక్టును కూ డా బాంబులు పెట్టి కూల్చివేశారమోననే అనుమానం కలుగుతుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రెండేండ్లుగా మరమ్మతు చేపట్టకుండా కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కొడంగల్, పరిగి మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, కొప్పుల మహేశ్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్, పార్టీ నాయకులు శుభప్రద్‌పటేల్, క్యామ మల్లేశ్ పాల్గొన్నారు.