బడంగ్ పేట్, మే 1: కల్యాణలక్ష్మి చెక్కులు సరే తులం బంగారం ఏది? ప్రతి మహిళకు ఇస్తానన్న రూ.2,500 ఏమాయే? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి వంద రోజుల్లో మహిళలకు ఇస్తానన్న హామీలు ఎందుకు నెరవేర్చలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంమీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో 83 కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఆమె అందజేశారు. బాలాపూర్ తహసీల్దార్ ఇందిరాదేవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. చెక్కులు తీసుకున్న ప్రతి ఒక్కరూ తులం బంగారం ఏది? అని ప్రశ్నిస్తున్నారని చెప్పారు. కల్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం బాకీ ఉన్నదని స్పష్టంచేశారు. కేసీఆర్ కిట్టును ఎందుకు రద్దు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
మహిళలకు ఉన్న పథకాలను రద్దుచేసి వారిని కోటీశ్వరులను చేస్తామని ఎలా చెప్తారని నిలదీశారు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో కోటి మంది మహిళలు ఉన్నారని, వారిలో ఏ ఒక్కరినైనా కోటీశ్వరురాలిని చేశారా..? అని నిలదీశారు. తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేయడం తప్ప అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాదని విమర్శించారు. కార్యక్రమంలో డీటీ మణిపాల్‌రెడ్డి, ఆర్ఐ ప్రశాంతి, కమిషనర్ జ్ఞానేశ్వర్, ఆర్వో చంద్రశేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు అర్కల కామేశ్‌రెడ్డి, దిండు భూపేశ్‌గౌడ్, అరకల భూపాల్‌రెడ్డి, దీప్లాల్ చౌహన్, శీనునాయక్, బొక్క రాజేందర్‌రెడ్డి, మదారి రమేశ్, పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అవినాశ్, సునీతాబాలరాజ్, పంతంగి మాధవి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.