వికారాబాద్, అక్టోబర్ 6: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దొంగల్ల్లా చూస్తున్నదని, ఎలాంటి తప్పులు లేకుండానే రైతులను పోలీస్స్టేషన్లలో నిర్బంధిస్తున్నదని బీఆర్ఎస్ మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆగ్ర హం వ్యక్తంచేశారు. సోమవారం వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలానికి చెందిన ట్రిపులార్లో బాధిత రైతులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ నవాబుపేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి రైతులతో మాట్లాడి భరోసా కల్పించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆ రైతులతో ఫోన్లో మాట్లాడి భరోసా కల్పించారు.
ట్రిపులార్ రైతుల పక్షాన పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సంసిద్ధంగా ఉన్నదని, రైతులు అధైర్య పడొద్దని ధైర్యం చెప్పారు. ఎప్పుడు పిలిచినా రైతుల పక్షాన నిలబడేందుకు తాను సిద్ధంగా ఉన్నామని తెలిపారు. భూములను ఇష్టారీతిన లాక్కుంటున్న ప్రభుత్వం వారిపై ఈ దమనకాండ ఏమిటని ప్రశ్నించారు. టెర్రరిస్టులు, దోపిడీ దొంగల వలే రైతుల ఇండ్లల్లోకి పోలీసులు వెళ్లి అరెస్టులు చేయడం ఏమిటని మెతుకు ఆనంద్ మండిపడ్డారు.
అన్నంపెట్టే రైతులు చెప్పే సమస్యలను కూడా వినకుండా దొంగల్లాగా అరెస్ట్ చేయడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత జిల్లాలోనూ రైతులు ఇబ్బందులు పడుతున్నా స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య, స్పీకర్ గడ్డం ప్రసాద్, సీఎం రేవంత్‌రెడ్డికి కనికరం లేదా? అని ప్రశ్నించారు.