హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని, అందుకే ప్రజావ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేందుకే సీఎం రేవంత్రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నేత సబితాఇంద్రారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మూసారాంబాగ్ వంతెన ప్రారంభోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ముఖ్యమంత్రి దిగుజారుడు విమర్శలు చేయడాన్ని మంగళవారం ఒక ప్రకటనలో ఆమె తీవ్రంగా ఖండించారు.
కేసీఆర్పై విమర్శలు చేసినంత మాత్రాన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు మరుగునపడవని, పాలనపై దృష్టిపెట్టకుండా ప్రతిపక్షాన్ని తిట్టడమే పనిగా పెట్టుకోవడం ప్రభుత్వ దివాలాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. తెలంగాణను ప్రగతిపథంలో నిలిపిన కేసీఆర్ ముద్రను ప్రజల గుండెల నుంచి చెరిపివేయడం రేవంత్రెడ్డి వల్ల కాదని స్పష్టంచేశారు. విమర్శలు, చిల్లర రాజకీయాలు పకనబెట్టి, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై సీఎం దృష్టిపెట్టాలని సబితారెడ్డి హితవు పలికారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయానికి అదనంగా తులం బంగారం ఇస్తామని ఆశచూపి ఓట్లు దండుకున్న కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక ఆ హామీని పూర్తిగా బుట్టదాఖలు చేసిందని ఆరోపించారు. బంగారం ఇవ్వడం దేవుడెరుగు, గతంలో ఇచ్చిన సాయాన్ని కూడా ఎత్తివేసేలా కుయుక్తులు పన్నుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ చేస్తున్న ఈ వంచనను, చౌకబారు జిమ్మికులను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఎన్నికల వేళ ఇచ్చిన 6 గ్యారెంటీలతోపాటు 420కి పైగా హామీలను గాలికి వదిలేసి రైతులు, మహిళలు, విద్యార్థులు, యువత, దివ్యాంగులను మోసగించిన ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఇవాళ్టి నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసనలు చేపడుతున్నట్టు సబితారెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిలదీసేందుకు గులాబీ శ్రేణులు, ప్రజలు పెద్దఎత్తున కదిలివచ్చి విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.