హైదరాబాద్: రంగరెడ్డి జిల్లాలో పలు మండలాలకు చెందిన రైతులకు రైతు భరోసా (Rythu Bharosa) నిధులను ప్రభుత్వం నిలిపివేయడంపై రైతులు మండిపడుతున్నారు. జిల్లాలోనిదాదాపు 9 మండలాల రైతుల ఖాతాలో రైతు భరోసా జమకాలేదు. దీంతో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకొచ్చారు. మాజీ ఎమ్మెల్యే రంగరెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డితోపాటు ఆయా మండలాలకు చెందిన రైతులతో కలసి సబిత ఇంద్రారెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి వినతి పత్రం అందచేశారు. తక్షణమే ఆయా రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు జమ చేయాలని వారు డిమాండ్ చేశారు.
రంగారెడ్డి జిల్లాలోని పది మండలాల్లో రైతుభరోసా పథకాన్ని రద్దు చేయడంపై రైతులు భగ్గుమంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రైతులు తమ పొలాల్లోనే నిరసన వ్యక్తంచేస్తూ.. రేవంత్ సర్కార్‌పై పోరుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి రైతులకు మద్దతుగా నిలిచారు.
రైతుభరోసా ఎలా నిలిపేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, బాలాపూర్, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్, హయత్‌నగర్, రాజేందర్‌నగర్, శంషాబాద్ తదితర మండలాల్లో ఉన్న రైతులకు రైతుభరోసా బ్యాన్ చేశారని సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ నగర శివారుల్లో ఉన్న రైతులు ఎక్కువ శాతం ఆకుకూరలు, కూరగాయలు పండించేవారని గుర్తుచేశారు.
రవాణా సౌకర్యం, మార్కెట్ అందుబాటులో ఉండటం, త్వరగా చేతికొచ్చే పంటలు కనుక రైతులు కూరగాయలు, ఆకుకూరలపై ఎక్కువ దృష్టి పెట్టేవారని చెప్పారు. హైదరాబాద్ శివారు మండలాల్లో ఉన్న రైతులకు రైతుభరోసాను బ్యాన్ చేయడం ఏమిటని మండిపడ్డారు. వారికి రైతుభరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతులకు అండగా నిలబడి పోరాటం చేస్తామని హెచ్చరించారు. కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన రైతుబంధుకు కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.