హైదరాబాద్, జూన్ 13 (నమసే తెలంగాణ): పాఠ్యపుస్తకాలలో కేసీఆర్ పేరు ఉంటే తప్పేంటని విద్యాశాఖ మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి గురువారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. కేసీఆర్ ఫొటో, కేసీఆర్ గుర్తులు తొలగించాలనే ఆలోచనను పక్కనపెట్టి పాలనపై దృష్టిసారించాలని ప్రభుత్వానికి సూచించారు. తమిళనాడులో స్టాలిన్ సీఎం కాగానే జయలలిత ఫొటోతో ఉన్న బుక్స్, బ్యాగ్స్‌ను యథావిధిగా విద్యార్థులకు ఇచ్చి తన మంచితనాన్ని చాటుకున్నారని గుర్తుచేశారు. ఏపీలో సీఎం జగన్‌రెడ్డి బొమ్మతో ఉన్న కిట్లను పంపిణీ చేయాలని, ప్రజాధనాన్ని వృథా చేయొద్దని ఆదేశించి అక్కడి ప్రభుత్వం ఎంతో హుందాగా వ్యవహరించిందని, అటువంటి హుందాతనం రాష్ట్ర సీఎంకు ఎక్కడికిపోయిందని ప్రశ్నించారు.
విద్యార్థులకు ఇచ్చిన బుక్స్‌లో కేసీఆర్ పేరు ఉన్నదని బుక్స్ వెనక్కి తెప్పించటం పేజీలను చించివేయటం, ఆ పేజీలపై మరో పేజీని అతికించటం సమంజసమా? ఇటువంటి అనాలోచిత చర్యల వల్ల ప్రజాధనం వృథా కాదా? అని సబిత ప్రశ్నించారు. అధికారంలోకొచ్చి ఆరునెలలు అవుతున్నా విద్యార్థులకు అందించాల్సిన పాఠ్యపుస్తకాలు, యూనిఫాంపై దృష్టిసారించలేదని మండిపడ్డారు. తాము ఏటా 23 లక్షల మంది విద్యార్థులకు రూ. 108 కోట్లు వెచ్చించి రూ. 1.90 కోట్ల ఉచిత పుస్తకాలు ముద్రించి సకాలంలో అందజేసిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. రూ. 34.70 కోట్లతో 11.27 లక్షలమంది విద్యార్థులకు వర్క్‌బుక్స్ రూ. 12.30 కోట్లతో ఉచిత నోట్‌బుక్‌లను, పాఠ్యపుస్తకాలను అందించిన విషయాన్ని విద్యాశాఖ మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి గుర్తుచేశారు.