ఆదిబట్ల, ఏప్రిల్ 19 : ముఖ్యమంత్రి అండతో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రెచ్చిపోయి ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నాడని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి విరుచుకుపడ్డారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని నాదర్గుల్ ప్రాంతంలోని సర్వేనంబర్ 613లో కబ్జాకు గురైన 375 ఎకరాల ప్రభుత్వ భూముల్లో ఎండిన పంటలు, వ్యవసాయం కోసం ఉపయోగించిన బోర్లు, కుంటను రైతులతో కలిసి ఆమె పరిశీలించారు. అనంతరం ధర్నా చేస్తున్న రైతులతో మాట్లాడారు. కాసుబాగు శివరాజు బహదూర్ భూముల కోసం కొన్నేండ్లుగా కొనసాగుతున్న పోరాటం మాములుది కాదని పేర్కొన్నారు. వైఎస్సార్ హయాంలో ఈ భూములను ప్రభుత్వ భూములుగా ప్రకటించారని ఆమె గుర్తుచేశారు. హైకోర్టు సింగిల్‌బెంచ్, డబుల్ బెంచ్ రెండూ ప్రభుత్వ భూములేనని చెప్పినా ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ కేసు నడుస్తున్నదని, వచ్చే నెల 5న ఈ కేసు ఉన్నదని చెప్పారు.
ప్రజలకు న్యాయం చేయాల్సిన కోర్టులు సైతం ప్రభుత్వ ఆధీనంలో బందీలుగా మారాయని సబితాఇంద్రారెడ్డి విమర్శలు చేశారు. ప్రభుత్వం ఏది చెబితే కోర్టులు అవే తు.చ తప్పకుండా అదే చెబుతునాయని మండిపడ్డారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులు ఇంత దర్జాగా కబ్జా చేస్తున్నా కనీసం పట్టించుకునేవారు లేరని ఆగ్రహం వ్యక్తంచేశారు. నాదర్గుల్ ప్రాంతంలో సుమారు 375 ఎకరాల ప్రభుత్వ భూములనే నమ్ముకొని 600కు పైగా రైతు కుటుంబాలు జీవిస్తున్నాయని, ఒక్కో కుటుంబం ఒకటి నుంచి మూడెకరాల వరకు సాగు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. అయితే రైతులను వారి భూముల్లోకి వెళ్లనివ్వకుండా సెక్యూరిటీ అడ్డుకోవడం చాలా అన్యాయమని ధ్వజమెత్తారు. ఇవి ప్రభుత్వ భూములేనని స్వయంగా రెవెన్యూశాఖ మంత్రి మీడియా సమావేశంలో ప్రకటించినా చర్యలు తీసుకోక పోవడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికే బీఆర్ఎస్ తరఫున జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె నిలదీశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే కబ్జాచేసిన భూముల చుట్టూ వేసిన రేకులను వెంటనే తొలగించాలని, రైతులను వారి భూముల్లోకి అనుమతించాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీఆర్ఎస్ తరఫున రైతుల కోసం పోరాడుతామని హెచ్చరించారు.
భూములు దక్కేవరకు పోరాటం ఆపవద్దని రైతులకు సూచించారు. కాసుబాగు భూ బాధితుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని, అన్ని విధాలా సహకరిస్తామని రైతులకు భరోసా కల్పించారు. బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానని చెప్పారు. కాగా సబితాఇంద్రారెడ్డి పర్యటనకు రావడంతో సుమారు 200మంది పోలీసులు మోహరించారు. ఆదిబట్ల ఏసీపీ ప్రదీప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదిబట్ల సీఐ రవికుమార్, బాలాపూర్ సీఐ సుధాకర్, మీర్పేట్ సీఐ శోభన్ సిబ్బందితో కలిసి రైతులు భూముల్లోకి వెళ్లకుండా కట్టడి చేశారు.