ఖైరతాబాద్, సెప్టెంబర్ 10: అసెంబ్లీ సమావేశాల తొలి రోజున తమ పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ సబితాఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తమను అడ్డుకొనే క్రమంలో పోలీసులు తన గొంతు పట్టుకున్నారని, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి చీరను కూడా లాగారని చెప్పారు. ఆనాడు ద్రౌపదికి జరిగిన అవమానమే నేడు తమకు జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల ఇలాంటి ఘటనలు జరుగడం అత్యంత అవమానకరమని మండిపడ్డారు.
ఈ మేరకు గురువారం ఆమె.. ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, మాజీ మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌తో కలిసి సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీకి వెళ్లకుండా తమను అడ్డుకొనేందుకు సుమారు 500 మంది పోలీసులను మోహరించారని, తాము అకడికి చేరుకొన్న వెంటనే అప్పటివరకు ఉన్న మహిళా పోలీసుల స్థానంలో పురుష పోలీసులను తీసుకొచ్చారని పేర్కొన్నారు. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, తాము గతంలో ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు.
మమ్మల్ని రౌడీల మాదిరిగా చూశారు
తాము అసెంబ్లీకి వస్తే ఏదో రౌడీలను అడ్డుకుంటున్నట్టుగా రోడ్డుపైనే నిలువరించి అమానుషంగా వ్యవహరించారని సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు. తాము అకడికి చేరుకున్న వెంటనే అప్పటివరకు ఉన్న మహిళా పోలీసుల స్థానంలో పురుష పోలీసులను తీసుకొచ్చారని చెప్పారు. మహిళా సభ్యుల ముందు పురుష పోలీసులను ఎందుకు ఉంచాల్సి వచ్చిందని ప్రశ్నించారు. అదే సమయంలో పురుష సభ్యుల వద్దకు మహిళా పోలీసులను పంపిన తీరును బట్టి తమను అడ్డుకొనేందుకు ముందుగానే ఒక ప్రణాళికతో వ్యవహరించారనే విషయం అర్థమవుతున్నదని అన్నారు.
మహిళా పోలీసులు తమను అడ్డుకొనే సమయంలో ఎకడ తగులుతారోనన్న ఆలోచనతో జాగ్రత్తగా వ్యవహరించారని, కానీ పురుష పోలీసులు తమ పట్ల దురుసుగా వ్యవహరించారని ఆరోపించారు. అసెంబ్లీకి వెళ్తున్న తమను అడ్డుకోవాలని పోలీసులకు ఎవరు ఆదేశాలు ఇచ్చారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసు అధికారులు తమపై ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు.
కమాండ్ కంట్రోల్లో కూడా తమపై పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల ఫిర్యాదు చేశామని, అయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదని చెప్పారు. తాము ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోకపోగా, తమపైనే ఉల్టా కేసులు పెట్టారని ఆరోపించారు. మొత్తం 14 మందిపై అక్రమంగా కేసులు నమోదు చేశారని అన్నారు. స్పీకర్‌ను తానేమీ అనలేదని తమ పార్టీ సభ్యుడు స్పష్టంగా చెప్పినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని పేరొన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు తమ పార్టీ సభ్యులను ఉద్దేశించి ‘దళిత స్పీకర్’ అంటూ పలుమార్లు వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఆ వ్యాఖ్యలను పట్టించుకోకుండా తమ పార్టీ సభ్యులపైనే కేసులు పెట్టడం ఏందని ప్రశ్నించారు.
సీఎం ఇప్పటివరకు పోలీసుల తీరును ప్రశ్నించలేదు
మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి ఇప్పటివరకు ప్రశ్నించకపోవడం బాధాకరమని సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. మహిళా సభ్యుల ముందు పురుష పోలీసులను ఎందుకు మోహరించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమలాంటి ప్రజాప్రతినిధులకే పోలీసుల నుంచి ఈ విధమైన పరిస్థితి ఎదురైతే సామాన్య ప్రజలకు రక్షణ ఎకడ ఉంటుందని ప్రశ్నించారు. తాము సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వస్తున్నామని ముందుగానే సీఐకి సమాచారం ఇచ్చామని, అయినప్పటికీ తాము పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన సమయంలో సీఐ అకడ లేకపోవడం ఏందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా తమ ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేయాలని కోరారు. తమ పట్ల అమానుషంగా వ్యవహరించిన పోలీసు అధికారులు, ఇతర బాధ్యులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సీఎం హుందాగా వ్యవహరించాలి
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి హుందాగా వ్యవహరించాలని సబితాఇంద్రారెడ్డి సూచించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి స్వయంగా విఘాతం కలిగించేలా వ్యవహరించకూడదని వ్యాఖ్యానించారు. రా ష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు, ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల హకులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని చెప్పారు. తమపై జరిగిన ఘటనల విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకొనే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు. మహిళా ప్రజాప్రతినిధుల గౌరవం, ప్రజాస్వామ్య హకుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ వెనకి తగ్గబోదని తెలిపారు.
కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యల పట్ల ఆగ్రహం
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల సబితాఇంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ ఇంటిముందు చావుడప్పు కొట్టడం వంటి చర్యలకు పాల్పడటం కంటే దౌర్భాగ్యం ఏముంటుందని ప్రశ్నించారు. తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలిపేందుకు కేసీఆర్ చేసిన కృషిని ప్రస్తావిస్తూ, అలాంటి నాయకుడి చావును కోరుకొనే స్థాయికి రాజకీయాలు దిగజారడం దురదృష్టకరమని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బీజేపీ నేతలకు ఒక న్యాయం.. మాకు మరో న్యాయమా?
అసెంబ్లీకి బీజేపీ నాయకులు ప్లకార్డులు పట్టుకొని వచ్చినప్పటికీ, వారిని లోపలికి అనుమతించారని సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు. అదే సమయంలో బీఆర్ఎస్ సభ్యులు నల్లచొకాలు ధరించి అసెంబ్లీకి వస్తే ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ప్రజల తరఫున అసెంబ్లీలో నిరసన తెలియజేయడానికి వస్తున్న తమను అడ్డుకోవడంలో ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. తమను అడ్డుకొనేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించారని ఆరోపించారు. తాము అసెంబ్లీ వైపు వస్తున్న సమయంలో సుమారు 500 మంది పోలీసులను అకడ మోహరించారని ఆరోపించారు.