హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెడికల్ డివైజెస్ పార్క్‌లో ఎస్3వీ వాస్కులర్ టెక్నాలజీస్.. రూ.250 కోట్ల పెట్టుబడితో స్టెంట్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆనందం వ్యక్తం చేస్తూ సంస్థకు స్వాగతం పలికారు. “మన వైద్య పరికరాల్లో దాదాపు 78 శాతం దిగుమతి చేసుకుంటున్నవే. స్థానిక ఉత్పత్తిని మరింత ప్రోత్సహించేందుకు సుల్తాన్‌పూర్‌లో 250 ఎకరాల్లో వైద్య పరికరాల పార్క్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఇక్కడ రూ.250 కోట్లతో యూనిట్ ను ఏర్పాటు చేసి, 750 మందికి ఉపాధి కల్పించడానికి వచ్చిన ఎస్3వీ వాస్కులర్‌కు స్వాగతం” అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
హెచ్‌జీసీఎల్‌లో సోలార్ ప్యానెల్లు
దక్షిణ కొరియా తరహాలో హైవే మధ్యలో సోలార్ ప్యానెల్ వ్యవస్థను తెలంగాణలోనూ అమలు చేయనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రీన్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిస్టిట్యూట్ ప్రెసిడెంట్ ఎరిక్ సోల్హీమ్ శుక్రవారం “దక్షిణ కొరియాలో హైవే మధ్యలో సోలార్ ప్యానెల్లు. మధ్యలో సైకిల్ మార్గం ఉన్నాయి. సైక్లిస్టులకు సూర్యుడి నుంచి రక్షణ ఉంటుంది. ట్రాఫిక్ సమస్య ఉండదు. అలాగే క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది” అని ట్వీట్ చేస్తూ వీడియోను షేర్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ “ఓఆర్ఆర్పై హెచ్‌జీసీఎల్ (హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్)లో ప్రతిపాదించిన 21 కీ.మీల సైక్లింగ్‌లో దీన్ని పునరావృతం చేద్దాం” అని ట్వీట్ చేశారు.
మీరు ఇతర రాష్ర్టాలకు రోల్ మోడల్: మంత్రి కేటీఆర్‌కు నెటిజన్ ట్వీట్..
“మీ పనితీరు హైదరాబాద్‌ను దేశంలోనే అత్యుత్తమ నగరంగా మారుస్తుంది. మీరు నిజంగా ఇతర రాష్ర్టాలకు రోల్ మోడల్” అని వెంకీసాయి అనే వ్యక్తి మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ “హైదరాబాద్ ఇప్పటికే దేశంలో అత్యుత్తమ నగరం. మెర్సర్ ర్యాంకింగ్స్‌లో భారతీయ నగరాల నివాసయోగ్యత సూచికలో వరుసగా ఐదేండ్లు (2015-20 వరకు) హైదరాబాద్ అత్యుత్తమ రేటింగ్‌ను సాధించింది” అని ట్వీట్ చేశారు.