హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్‌కు గురువారం నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎస్ సురేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఆయన 1,396 ఓట్లు సాధించి, తన సమీప అభ్యర్థి చికుడు ప్రభాకర్‌పై 275 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. చికుడు ప్రభాకర్‌కు 1,121 ఓట్లు, మూడోస్థానంలో నిలిచిన ఎల్ రవిచందర్‌కు 929 ఓట్లు లభించాయి.
ఉపాధ్యక్షుడిగా డీఎల్ పాండు 1,227 ఓట్లు, కార్యదర్శులుగా పీ శ్రవణ్‌కుమార్‌గౌడ్ 1,380 ఓట్లు, కే నిరంజన్‌రెడ్డి 1,267 ఓట్లు, జాయింట్ సెక్రటరీ (మహిళ)గా పులిపాలుపుల కృష్ణకీర్తన రికార్డు స్థాయిలో 2,306 ఓట్లు సాధించి ఘన విజయం సాధించారు. ఆమె సమీప ప్రత్యర్థి పసుపులేటి రాధికకు 791 ఓట్లు వచ్చాయి. కోశాధికారిగా బానోత్ బాలాజీ 803 ఓట్లు, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా విష్ణువర్దన్ జయసూర్య 1,647 ఓట్లు సాధించి విజయం సాధించారు.
ఎగ్జిక్యూటివ్ సభ్యుడి (సీనియారిటీ 30 ఏండ్లు)గా నాగులూరి కృష్ణకుమార్‌గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 15 ఏండ్ల క్యాటగిరీ నుంచి (జనరల్) జకా కొండారెడ్డి, రుక్మిణి పల్లెల (మహిళ), ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌గా కే భార్గవి, జీ శిల్ప, జీ అరవింద్‌కుమార్, ఆర్పీ నాయక్, పీ రవి ఎన్నికయ్యారు. రికార్డు స్థాయిలో రుక్మిణి 2,515, ఆ తర్వాత కృష్ణకీర్తన 2,306 చొప్పున ఓట్లు సాధించారు. ఈసారి ఎన్నికల ఫలితాలను స్రీన్స్ ద్వారా వెల్లడించారు.