హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): మహబూబ్నగర్లో ప్రధాని మోదీ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని, కనీసం.. నిజామాబాద్లోనైనా నిజాలు మాట్లాడాలని రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి హితవు చెప్పారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఇచ్చే గల్లీలెక్కలు పక్కనపెట్టి.. కేంద్రం నుంచి అధికారిక లెక్కలు తెచ్చుకోవాలని సూచించారు. హైదరాబాద్లోని బీఆర్ఎస్ఎల్పీలో సోమవారం ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్తో కలిసి పల్లా రాజేశ్వర్రెడ్డి మీడియాతో మట్లాడారు. దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి గాడ్సే భావజాలాన్ని విస్తరిస్తున్నాయని మండిపడ్డారు. నకిలీ గాంధీ (కాంగ్రెస్)లు ఆయన పేరును దిగజారుస్తున్నారని విమర్శించారు. దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గాంధేయవాదాన్ని భుజానికెత్తుకున్నదని, గాంధేయవాదంతోనే తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి, విజయతీరాలకు చేర్చారని గుర్తుచేశారు.
ప్రధాని మోదీ అవాస్తవాలు మాట్లాడటం సరికాదని పల్లా రాజేశ్వర్రెడ్డి ధ్వజమెత్తారు. ‘ధాన్యం సేకరణ కోసం 2014లో రూ. 3,400 కోట్లు ఇస్తే.. ఇప్పుడు రూ.27 వేలకోట్లు ఇస్తున్నాం’ అని మోదీనే స్వయంగా చెప్పారని.. చుక్కనీళ్లు లేకపోతే అంత ధాన్యం ఉత్పత్తి ఎలా పెరిగిందని నిలదీశారు.
నిజామాబాద్లో పసుపుబోర్డు ఇవ్వాలని 2014 నుంచే బీఆర్ఎస్ కోరుతున్నదని పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. చివరికి.. ఎన్నికలకు ముందు మోదీకి పసుపు రైతులపై ప్రేమ పుట్టుకొచ్చిందని, అయినా సంతోషమేనని అన్నారు. బీఆర్ఎస్ది కుటుంబ పార్టీ అని మోదీ అనడం హాస్యాస్పదంగా ఉన్నదని విమర్శించారు.
విభజన చట్టం ప్రకారం తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని స్పష్టంగా ఉన్నదని పల్లా రాజేశ్వర్రెడ్డి గుర్తుచేశారు. భూమి ఇవ్వలేదు కాబట్టే గిరిజన యూనివర్సిటీ ఆలస్యమైందని మోదీ పచ్చి అబద్ధం చెప్పారని, 2016లోనే భూమిని కేటాయించి, కేంద్రానికి లేఖలు పంపామని తెలిపారు.