హైదరాబాద్ : రైతు బంధు నిధులు రూ. 564.08 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. 2,49,969 మంది రైతుల ఖాతాలలో నిధులు జమ చేసినట్లు పేర్కొన్నారు. 11 లక్షల 28 వేల 184.38 ఎకరాలకు నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు మొత్తం 59 లక్షల 08 వేల 453 మంది రైతుల ఖాతాలలో రూ.5318.73 కోట్లు జమ అయినట్లు మంత్రి స్పష్టం చేశారు.
వ్యవసాయ రంగమే భారత్‌ను ప్రపంచ దేశాలలో అగ్రస్థానంలో నిలబెడుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. అత్యధిక శాతం జనాభా ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర వ్యవసాయ విధానం లేకపోవడం విచారకరమన్నారు. ప్రపంచంలో అత్యధిక యువశక్తి అందుబాటులో ఉన్న దేశం భారతదేశం అని తెలిపారు. ప్రపంచానికి ఆహారం అందించే వ్యవసాయ రంగం వైపు యువతను మళ్లించాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఎనిమిదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ వ్యవసాయరంగాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపారని చెప్పారు. వినూత్న పథకాలతో వ్యవసాయరంగానికి ప్రోత్సాహం ఇచ్చి నిలబెట్టారు. కేసీఆర్ వ్యవసాయ విధానాలు దేశాన్ని ఆకర్షిస్తున్నాయని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.