హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పదో విడుత రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఆరో రోజు లక్షా 49,970 మంది రైతుల ఖాతాల్లో రూ. 262.60 కోట్ల నిధులు జమ అయ్యాయి. 5 లక్షల 25 వేల 200.21 ఎకరాలకు నిధులు విడుదల అయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 51 లక్షల 50 వేల 958 మంది రైతులకు రూ.3767.35 కోట్లు జమ అయ్యాయి.
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశమంతా తెలంగాణ పథకాలు అమలు కావాలన్నారు. కేసీఆర్ ఆలోచనలు దేశానికి అత్యవసరం అని చెప్పారు. కేంద్రంలోని పాలకులపై కేసీఆర్ సంధించిన ప్రశ్నలపై సమాజంలో చర్చ మొదలయింది అని పేర్కొన్నారు. రైతాంగానికి సాగునీరు, ఉచిత కరెంటుపై పాలకుల వైఖరి మారాలన్నారు. ఉచితం అంటే అనుచితంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అన్నం పెట్టే అన్నదాతలను చులకనగా చూస్తున్నారని నిరంజన్ రెడ్డి అన్నారు.
దేశంలో 60 శాతం జనాభా ఆధారపడ్డ వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయాలని ఎనిమిదేళ్లలో కేసీఆర్ వినూత్న పథకాలతో పటిష్టం చేశారని మంత్రి గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి సాయం చేయకున్నా కరంటు, సాగునీరు, రైతుబంధు, రైతుభీమా పథకాలు అమలు చేస్తున్నారు. దేశమంతా ఈ పథకాలు అమలైతే దేశ వ్యవసాయం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది అని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.