హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): పంట నష్ట పరిహారం చెల్లింపుల కోసం రైతు సంఘాలన్నీ ఏకమై పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని ఏఐకేఎస్ జాతీయ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి పిలుపునిచ్చారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం కండ్లు తెరిపించేలా పోరాట కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సుమారు రూ.ఐదు వేల కోట్ల నుంచి రూ.ఆరు వేల కోట్ల వరకు పంట నష్టం జరుగుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం కంటితుడుపు చర్యగా.. రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకుంటున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘పంటనష్టం-మార్కెటింగ్ సమస్యలు’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశానికి సారంపల్లి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులకు ప్రకృతి వైపరీత్యాలు, మార్కెటింగ్ ప్రధాన సమస్యగా మారాయని వివరించారు. రాష్ట్రంలో 4.8 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారని గుర్తుచేశారు. యాసంగిలో రాళ్ల వర్షం కారణంగా మరో ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫసల్ బీమా పథకంలో చేరుతున్నట్టు గతంలో ప్రకటించారని.. ఇందుకోసం బడ్జెట్లో రూ.480 కోట్లు కేటాయించినట్టు చెప్పారని గుర్తుచేశారు. జూలై 30 వరకు ప్రీమియం కట్టాల్సి ఉండగా, గడువు తీరినా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పంట నష్ట పరిహారం ఇవ్వడంలో జాప్యం కారణంగా రైతులు, కౌలురైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. భూభారతి తెచ్చానని సీఎం రేవంత్‌రెడ్డి గొప్పలు చెప్తున్నా.. అందులో కౌలురైతు అనే పదమే లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అనేక భ్రమలు కల్పించిందని, కనీసం రైతులకు అప్పులు ఇవ్వడంలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో స్టేట్‌లెవల్ బ్యాంకర్ల కమిటీ పనిచేయడంలేదని ఆరోపించారు.
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రధాని మోదీ చెప్పారని, 2025 కావస్తున్నా రైతుల ఆదాయం రెట్టింపు కాలేదని సారంపల్లి మల్లారెడ్డి విమర్శించారు. పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్రం కొత్తకొత్త కొర్రీలు పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామాల్లో 50 ఏండ్లు పైబడిన 50% మందికి అక్షరాలే రావని, వారు ఎలా యాప్‌లో తమ స్లాట్ బుక్ చేసుకోగలుగుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో తేమ శాతం నిబంధనతో పత్తి రైతులు రూ.4,500 కోట్లు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రధాని మోదీ మూడు నల్లచట్టాలను ఉప సంహరించుకున్నామని ప్రకటించినా.. పరోక్షంగా రైతులపై వాటిని అమలుచేస్తున్నారని దుయ్యబట్టారు. తేమ శాతం పేరిట అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై రైతులను నట్టేట ముంచుతున్నారని ఆరోపించారు. సమావేశంలో రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు కన్నెగంటి రవి, విస్సా కిరణ్‌కుమార్, బీ కొండల్, మహిళా రైతుల హక్కుల వేదిక ప్రతినిధి ఆశాలత, కిసాన్ మిత్రలు టీ హర్ష, భార్గవి, అఖిల భారత రైతు సంఘం ప్రతినిధి వీ ప్రభాకర్, తెలంగాణ రైతాంగ సమితి ప్రతినిధి జక్కుల వెంకటయ్య, తెలంగాణ రైతు సంఘం ప్రతినిధి సోమిడి శ్రీనివాస్, ైక్లెమెట్ ఫ్రంట్ ప్రతినిధి ఆరుణ్య, సామాజిక కార్యకర్త పృథ్వీరాజ్, డా జీ రాజశేఖర్, చిట్టెమ్మ, ఆంజనేయులు, అఖిల్ సూర్య వివిధ జిల్లాల నుంచి రైతులు పాల్గొన్నారు.
మొంథా తుఫాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం ఎకరానికి 10 వేల నష్ట పరిహారం ఇస్తామని హామీ ఇచ్చిం ది. 85 రోజులు గడిచినా నష్ట పరిహారం ఇవ్వలేదు. కోతకు గురైన భూమికి రూ.25 వేలు పరిహారంగా ఇవ్వాలి. ఆసియాలోనే నాణ్యమైన పత్తిని ఆదిలాబాద్ జిల్లాలో ఉత్పత్తి చేస్తున్నారు. కపాస్ యాప్‌లో నెట్వర్క్ సమస్యలున్నాయి. ప్రభుత్వం వెంటనే కౌలురైతులకు రుణార్థ కార్డులు ఇవ్వాలి.
– సంగెపు బొర్రన్న, రైతు, గౌరాపూర్, ఇంద్రవెల్లి మండలం, ఆదిలాబాద్ జిల్లా
ప్రభుత్వం కౌలురైతులకు రైతుభరోసా, పెట్టుబడి సాయం అందించాలి. కౌలురైతులకు గుర్తింపుకార్డులు ఇవ్వాలి. రాష్ట్రంలో ఫసల్‌బీమా పథకాన్ని అమలుచేయాలి. పత్తి, సోయా పంటలను కొర్రీలు పెట్టకుం డా కొనుగోలు చేయాలి. ఆదిలాబాద్ జిల్లా లో ఆగస్టులో పంట నష్టం సర్వే చేసి.. ఇప్పటివరకు ఎలాంటి నష్ట పరిహారం చెల్లించలేదు. సోయా కొనుగోలులో పట్టాదారులే రావాలన్న నిబంధనను ఎత్తివేయాలి. కుటుంబసభ్యుల్లో ఎవరూ వచ్చినా.. పంట అమ్ముకునే వీలు కల్పించాలి.
– రమాకాంత్, కౌలురైతు, తలమడుగు, ఆదిలాబాద్ జిల్లా
కాగజ్‌నగర్ డివిజన్లో ప్రాణహిత పరివాహక ప్రాంతం బ్యాక్‌వాటర్ కారణంగా పంట నష్టపోయాం. జిల్లాలో 15 వేల ఎకరాల పంట నష్టం జరిగినట్టు అంచనా. గత సంవత్సరం పంట నష్టపరిహారం కింద ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలే. పంట నష్టపోయి ఆసిఫాబాద్ జిల్లాలో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పత్తి, వరి, మక్కజొన్న పంట నష్టం జరిగింది. కపాస్ కిసాన్ యాప్‌పై ఆదివాసీ ప్రాంతాల్లో అవగాహన లేక రైతులు ఇబ్బందిపడుతున్నారు. ఈ యాప్ తీసేసి, గతంలో ఉన్న విధానాన్నే అమలుచేయాలి. పంట నష్ట పరిహారం వెంటనే అందజేయాలి.
-ఆనంద్, ఆదివాసీ కౌలురైతు, ఆసిఫాబాద్
మొంథా తుఫాన్ కారణంగా భారీగా పంట నష్టం వాటిల్లింది. అంతకుముందు యూరియా సమస్యతో అవస్థలు పడ్డాం. ప్రభుత్వం ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాలి. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. సకాలంలో పంటలను అమ్ముకోలేకపోతున్నాం. దళారుల మధ్య రైతులు నలిగిపోతున్నారు. కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచాలి. మా ప్రాంతంలో ప్రాజెక్టుల పేరిట భూములు లాక్కుంటుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
-ఆంజనేయులు, రైతు, కొత్తపల్లి, నెరడి గొమ్ము మండలం, నల్లగొండ జిల్లా
పత్తి విషయంలో ప్రభుత్వ విధానంలో మార్పు రావాలి. పత్తి ఎకరానికి రూ.30-40 వేల పెట్టుబడి పెడితే వర్షాల కారణంగా నీళ్లు నిలిచి కుళ్లిపోయినా పట్టించుకునే వారు కరువయ్యారు. అధిక వర్షాలతో వరి దిగుబడి తగ్గింది. తడిసిన ధాన్యాన్ని కొంటామని మంత్రులు చెప్తున్నా, కొనడం లేదు. పంట నష్ట పరిహారం రూ.10 వేలు ఇంకా ఇవ్వడంలేదు. కపాస్ కిసాన్ యాప్‌పై గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన లేదు. వడ్లలో తేమశాతం 16-17 వరకే ఉండాలని అధికారులు చెప్తున్నారు. వర్షాల కారణంగా తడిసిన వడ్ల తేమ శాతం 30కి చేరుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం పంట నష్ట పరిహారం ఇవ్వడంలో జాప్యం చేయడం సరికాదు.
– కరుణానిధిగౌడ్, గోనూర్, తాండూరు మండలం, వికారాబాద్ జిల్లా