కొడంగల్, ఫిబ్రవరి 5 : సీఎం రేవంత్‌రెడ్డి అవగాహనలేమితో మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడుస్తున్నప్పటికీ ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అమలుకాలేదని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన కొడంగల్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాలుగు పథకాల అమలులో భాగంగా గత నెల 26న కోస్గిలో బహిరంగసభ ఏర్పాటు చేసి రాత్రికి రాత్రే రైతు ఖాతాల్లో రైతుభరోసా జమ అవుతుందన్నారని, అరగంటలోనే మాటమార్చి 31వ తేదీలోపు అందిస్తామని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదని విమర్శించారు. ప్రతి రైతుకు లబ్ధి చేకూరేవరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. అధికారాన్ని దక్కించుకోవాలని ఏవిధంగా నోటికి వచ్చిన హామీని ఇచ్చారో అదేవిధంగా అమలు చేసేందుకు కూడా కృషి చేయాలని హితవుపలికారు. రైతుభరోసా, రైతుబీమా అందకపోవడంతో రైతులు వ్యవసాయం అంటేనే భయపడుతున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటివరకు మహిళలకు రూ.2500, తులం బంగారం, రూ.6వేల పెన్షన్ వంటి పథకాలు అమలు ఎందుకు నోచుకోవడంలేదని ప్రశ్నించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు జరగని కారణంగా గ్రామపంచాయతీలకు నిధులు అందక అభివృద్ధిలో వెనుకబడిపోతున్నట్టు పేర్కొన్నారు. సర్పంచ్‌లు అభివృద్ధి పనులు పూర్తి చేసేసందుకు నానాతంటాలు పడ్డారని, వారికి వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేసిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు చేపట్టాలని సూచించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలుచేసేందుకు అసెంబ్లీలు బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్‌కు చట్టబద్ధతతో 42శాతం అమలు చేసిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 10న నియోజకర్గంలోని కోస్గిలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో రైతు ధర్నా కార్యాక్రమాన్ని చేపడుతున్నట్టు పేర్కొన్నారు. రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు అభిమానులు, ప్రజలు అధికసంఖ్యంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించారు.