Rythu Bharosa | పాలకుర్తి, ఫిబ్రవరి 18: రైతుభరోసా కోసం ఎదురుచూపులు తప్పడంలేదు. ఇప్పటికే ఓ సీజన్ ఎగ్గొట్టిన కాంగ్రెస్ సర్కారు.. ప్రస్తుతం రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్(ఆర్ఎస్ఆర్) పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నది. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని అర ఎకరం, ఎకరం రైతులకు రైతుభరోసా రాలేదు. మండల వ్యాప్తం గా 2వేల ఎకరాల వ్యవసాయ భూమి కాంగ్రెస్ సర్కారు బ్లాక్ లిస్టులో పెట్టింది. దీంతో మండలవ్యాప్తంగా 1850 మంది రైతులకు రైతు భరోసా ఆగింది.
రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేసినా ఫలితం లేకుండాపోయింది. ఆర్ఎస్ఆర్లో గుంట, అర ఎకరం, ఎకరం పెరిగినా ఆ సర్వే నంబర్లో ఎంతమంది రైతులు ఉన్నా వారందరికీ రైతు భరోసా కట్ చేస్తున్నారు..
నాకు ఎకరంనర వ్యవసాయ భూమి ఉంది. అందులో పత్తి వేశాను. గతేడాది రైతుబంధు పడలేదు. ఈ సీజన్లోనూ వేయలే. ఎకరం, రెండెకరాల లోపు ఉన్న వారికి రైతు బంధు పడిందని అంటున్నరు. నాకు మాత్రం రాలేదు. రోజూ బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నా. ఎందుకు పడతలేదో తెలుస్త లేదు. కేసీఆర్ ఉండగా మంచిగా పడ్డది. ఇప్పుడేమో రైతు బంధు వస్తదా రాదా అని భయమేస్తున్నది.
– జలగం ఇందిరమ్మ, రైతు, దర్దేపల్లి, పాలకుర్తి