సిద్దిపేట మండలం లింగారెడ్డిపల్లిలో రైతుబంధు డబ్బులు పడిన మెస్సేజ్‌ను ఫోన్లో తల్లికి చూపిస్తున్న కుమారుడు
హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్‌కు సంబంధించి రైతుబంధు పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం బుధవారం రాష్ట్రవ్యాప్తంగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. తొలిరోజు ఎకరం చొప్పున 22,45,137 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.758,19, 25,476 కోట్లను పంపిణీ చేసింది. ఇప్పటివరకు 9 విడతల్లో సాయం అందించగా, 10వ విడత కింద 70.54 లక్షల మందికి రూ.5 వేల చొప్పున రూ.7,676.61 కోట్లను అందజేయనున్నది. 9 విడతల్లో రైతాంగానికి రూ.57,882 కోట్లు సాయం చేయగా, 10వ విడతతో కలిపి మొత్తం రూ.65,559.28 కోట్లు రైతుబంధు పథకానికి వెచ్చించినట్టవుతుంది.
పంట పెట్టుబడి సాయం కోసం ఇంత పెద్ద మొత్తాన్ని అందజేస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే కావడం విశేషం. ఆరుగాలం శ్రమించి పంట పండిస్తున్న రైతు పెట్టుబడి కోసం ఇబ్బంది పడొద్దన్నది సీఎం కేసీఆర్ ఆశయం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, విమర్శలు వచ్చినా వెరవకుండా ఠంఛన్‌గా పెట్టుబడి సాయం అందిస్తుండటంపై రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది. గురువారం రెండు ఎకరాల్లోపు వారికి డబ్బులు జమ కానున్నాయి.
సకాలంలో రైతుబంధు సాయం
యాసంగి సీజన్ రైతుబంధు నగదు జమ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. తొలిరోజు ఎకరంలోపు వారికి అందిం చాం. ఎకరం చొప్పున పెంచుకొంటూ అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేస్తాం. 10వ విడత రైతుబంధు పథకం కింద 70.54 లక్షల మంది కర్షకులకు లబ్ధి చేకూరుతుంది. పెట్టుబడి సాయం, పంటల కొనుగోళ్లు, రైతుబీమా తదితర వాటితో రాష్ట్రంలో పంటల సాగు అనూహ్యంగా పెరిగింది.
-ట్విట్టర్లో ఆర్థికమంత్రి హరీశ్‌రావు
కేసీఆర్ కల నిజమవుతున్నది
ఎన్నో కష్టాలు పడిన తెలంగాణ రైతులకు మంచిరోజులు వచ్చినయి. ఎవుసానికి ఇబ్బంది లేకుండా ఎకరానికి రూ.5 వేల చొప్పున అందజేస్తున్న రాష్ట్రం తెలంగాణ తప్పా దేశంలో ఎక్కడా లేదు. సీఎం కేసీఆర్ భారతీయుడిగా రైతులు, పేదలు సాధికారత పొందాలని కలలు కన్నారు. ఇప్పుడు ఆ కల తెలంగాణలో నిజమవుతున్నది.
-ట్విట్టర్లో ఎమ్మెల్సీ కవిత

రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు
రైతుబంధు డబ్బులు జమ చేయడం ప్రారంభం కావడంతో రాష్ర్టవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొన్నది. సాయం అందిన వారు బ్యాంకులకెళ్లి ఉత్సాహంగా పైసలు తీసుకొన్నారు. గ్రామగ్రామాన రైతుబంధు సమితులు, స్థానిక ప్రజాప్రతినిధులు సంబురాలు జరుపుకొన్నారు. పటాకులు కాల్చి సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. ఇప్పటివరకు ఏ సర్కారు కూడా సాగు కోసం పైసలియ్యలేదని, కేసీఆర్ సారు తమ కష్టాలను గట్టెక్కించారని పలువురు రైతులు ఆనందం వ్యక్తం చేశారు. పండిన పంట కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ ఆదుకొంటున్నదని పేర్కొన్నారు.
రైతుబాంధవుడు కేసీఆర్
దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతులకు పెట్టుబడి పైసలియ్యట్లే. కేసీఆర్ సారు దేవునోలె ఆదుకొంటుండు. ఎవుసం మొదలు కాగానే పైసలిస్తుండటంతో రంది లేకుండా పోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు నిజమైన బంధువు. రైతు కోసం, రైతు కోణంలో ఆలోచించే కేసీఆర్ మేలును మరువం. యాసంగి పెట్టుబడి సాయం అందింది.
-కోటగిరి రాజాగౌడ్, కమ్మర్పల్లి, నిజామాబాద్ జిల్లా
అప్పుల కోసం తిరిగే బాధ లేదు
టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల బతుకులు మారినయి. ఉమ్మడి రాష్ట్రంలో పంటల సీజన్ వచ్చిందంటే పెట్టుబడి సాయానికి అప్పుల కోసం వ్యాపారుల వద్దకు పోయేటోళ్లం. ఇప్పుడు రెండు సీజన్లలోనూ పంట పెట్టుబడిని ప్రభుత్వమే రైతుబంధు ద్వారా అందిస్తున్నది. ఇంకా వ్యాపారుల చుట్టూ ఎందుకు తిరుగుతం?
-రాములు, దంతెనం,దుమ్ముగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
కేసీఆర్ భరోసాతో సాగు పండుగ
సీఎం కేసీఆర్ భరోసాతోనే నాకున్న 30 గుంటల భూమిలో ఆనందంగా వ్యవసాయం చేస్తున్నా. దండుగ అనుకొన్న వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ సార్‌దే. గత ప్రభుత్వాల హయాంలో నీళ్లు లేక, పంటలు పండక ఎన్నో ఇబ్బందులు పడినం. రైతులంతా కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటాం.
-యల్మకంటి సత్తయ్య, రైతు, నాగారం, సూర్యాపేట
సర్కారు సాయం మరిసిపోలేను
పెట్టుబడి సాయాన్ని సర్కారు ఏటా ఇస్తాంది. వానకాలం, యాసంగికి పైసలు మొదటి రోజే బ్యాంకు ఖాతాల కేసీఆర్ సార్ ఏత్తాన్రు. నాకు పంకెన గ్రామంలో 30 గుంటల భూమి ఉన్నది. దీన్ల ప్రతి సంవత్సరం వరి వేస్త. ఎప్పటిలాగే యాసంగికి కూడా సర్కారు పెట్టుబడి సాయం ఇచ్చింది. సమయానికి డబ్బులిస్తున్న సర్కారును మరిసిపోలేను.
– కోడి లక్ష్మి, పంకెన, పలిమెల, జయశంకర్ భూపాలపల్లి జిల్లా