నిజామాబాద్ : రైతులను అడుగడుగునా ద్రోహం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతులు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy ) అన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్‌లోని ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
రైతు ఆశీర్వాద సభ అంటూ నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తిట్టడమే లక్ష్యంగా తన ప్రసంగాన్ని కొనసాగించారని ఆరోపించారు. ప్రజాధనంతో సభలు ఏర్పాటు చేసి ఆశీర్వాద సభను శాపనార్థాల సభగా మార్చారని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులను మోసం చేస్తున్నాడని రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. మోసంచేసే పార్టీని ఏ విధంగా రైతులు ఆశీర్వాదిస్తారని పేర్కొన్నారు.
2018 లో కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న రేవంత్ రెడ్డి మూడు నెలల్లో ఎంపీ ఎలక్షన్లో నిలబడటం సిగ్గుచేటన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగని విమర్శించారు. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మూడు లక్షల పెళ్లిళ్లు అయ్యాయని గుర్తు చేశారు. లబ్దిదారులకు వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు.