తిరుమల : అలిపిరి నడక మార్గం ( Alipiri footpath ) లో భక్తుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని టీటీడీ ( TTD) అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి ( Venkaiah Chowdary ) అధికారులకు సూచించారు. వన్యప్రాణుల సంచారాన్ని సమర్థవంతంగా నియంత్రించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. శనివారం తిరుమల పద్మావతి విశ్రాంతి భవనంలోని సుధర్మ సమావేశ మందిరంలో టీటీడీ, అటవీ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా చోటుచేసుకున్న వన్యప్రాణుల ఘటనలు, వాటి ధోరణులపై సమగ్ర డేటా విశ్లేషణ చేపట్టి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత ప్రణాళిక రూపొందించాలని సూచించారు. తిరుమల పరిసర ప్రాంతాల్లో వన్యప్రాణుల సంచార మార్గాలు, వాటి కదలికల తీరును శాస్త్రీయంగా అధ్యయనం చేసి, భక్తులకు ప్రమాదం కలిగించే ప్రాంతాలను గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
వన్యప్రాణుల సంచారానికి సంబంధించి ఇప్పటికే గుర్తించిన మూడు ప్రధాన ప్రమాద కారకాలను (రిస్క్ పారామీటర్లు) సమగ్రంగా పరిశీలించి, వాటి ప్రభావాన్ని తగ్గించే కార్యాచరణను రూపొందించాలని సూచించారు. అలిపిరి నడక మార్గంలోని దుకాణాల నిర్వహణ వల్ల వన్యప్రాణుల సంచారంపై, భక్తుల భద్రతపై ఎలాంటి ప్రభావం పడుతోందో సమగ్రంగా అధ్యయనం చేయాలన్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ప్రత్యేక ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు చేయాలన్నారు.