కుభీర్ : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో కల్పించిన హక్కులు ఆదిలోనే నీరుగారిపోతున్నాయి. నిర్మల్ జిల్లా కుబీర్ ( Kubeer Mandal ) మండల కేంద్రంలో శనివారం జరిగిన సమావేశం ఇందుకు ఉదాహరణగా మారింది.ఐకేపీ కార్యాలయంలో శనివారం ‘ వర్షాభావ పరిస్థితులు – తీసుకోవాల్సిన జాగ్రత్తలు’ అనే అంశంపై ఎంపీడీవో అక్కల్ దేవి శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారి జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో మండల సర్పంచులు ( Sarpaches ) , పంచాయతీ కార్యదర్శులు, ఏఈఓలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏలు హాజరయ్యారు. అయితే మహిళా సర్పంచులకు బదులు వారి భర్తలు, కుమారులు, బంధువులు హాజకు కావడం చర్చనీయాంశంగా మారింది. సమావేశానికి దర్జాగా హాజరై చర్చల్లో పాల్గొనడం పట్ల ద్వితీయ శ్రేణి అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు. మండలంలోని హల్డా సర్పంచ్ కొనింటి రజితకు బదులు ఆమె భర్త దేవేందర్ హాజరయ్యారు.
జామగాం సర్పంచ్ నవనీతకు బదులు భర్త సంజీవ్, సాంగ్వి సర్పంచ్ జరి లక్ష్మికి బదులు భర్త బొజేందర్, రంజిని తండా సర్పంచ్ కవితా బాయికి బదులు ఆమె బంధువు రంగారావు, పాముల సర్పంచ్ భారతిబాయికి బదులు ఆమె కుమారుడు దిగంబర్, రామ్ నాయక్ తండ సర్పంచ్ వందనా బాయికి బదులు ఆమె భర్త బిక్కులాల్ హాజరయ్యారు. మాలిగాం సర్పంచ్ శేల్కె లక్ష్మీబాయికి బదులు ఆమె భర్త శేల్కె ఆనంద్, చొండి సర్పంచ్ క్రాంతిబాయి కి బదులు ఆమె భర్త రాజు, సిరిపెల్లి సర్పంచ్ కల్పనాబాయికి బదులు ఆమె కుమారుడు బాలాజీ హాజరయ్యారు.