Ramesh Mahatre : వైద్యులు, ఇతర సిబ్బందిపై శివసేన (Shiv Sena) (ఏకనాథ్ షిండే వర్గం) కార్పొరేటర్ రమేష్ మహాత్రే (Ramesh Mahatre) జరిపిన దాడిని బాంబే హైకోర్టు (Bombay High Court) తీవ్రంగా పరిగణించింది. ఆయన బెయిల్‌ను రద్దు చేసింది. అదే సమయంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటలలోపు పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. జూలై 6న డోంబివిలిలోని మున్సిపల్ శాస్త్రినగర్ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులు, నర్సులపై కార్పొరేటర్ రమేష్ మహాత్రే, అతని అనుచరులు తీవ్రంగా దాడిచేశారు.
ఈ కేసులో అరెస్టయిన రమేష్ మహాత్రేకు జూలై 14న కల్యాణ్‌లోని స్థానిక మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు వారి బెయిల్ రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. రమేష్ మహాత్రేపై గతంలో హత్య, హత్యాయత్నం వంటి సుమారు 18 నేరారోపణ కేసులు ఉన్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా హైకోర్టు ప్రస్తావించింది. వాటిలో 17 కేసులలో అతను నిర్దోషిగా విడుదలైనప్పటికీ, బెయిల్ ఇచ్చేటప్పుడు అతని నేర చరిత్ర తీవ్రతను మేజిస్ట్రేట్ కోర్టు సరిగ్గా పరిగణనలోకి తీసుకోలేదని ఆక్షేపించింది.
ఈ క్రమంలోనే వారి బెయిల్‌ను రద్దు చేసి తిరిగి పోలీసులకు లొంగిపోవాలంటూ ఆదేశించింది. ప్రభుత్వ, మున్సిపల్ ఆసుపత్రుల వైద్యులపై ఇలాంటి దాడులు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని హైకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. రమేష్ మహాత్రే నిర్ణీత సమయంలోగా లొంగిపోకపోయినా, పరారైనా ఆయన స్థిరాస్తులను జప్తు చేయడంతోపాటు చట్టపరమైన తదుపరి చర్యలకు తీసుకోవడానికి అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉందని బాంబే హైకోర్టు తన తీర్పులో పేర్కొన్నది. ఈ ఘటనకు నిరసనగా జూలై 22 నుంచి సమ్మె నిర్వహించతలపెట్టిన వైద్యులకు సమ్మె నిర్ణయాన్ని విరమించుకోవాలని సూచించింది.
కాగా వైద్యులపై దాడికి సంబంధించి జూలై 8న అరెస్టయిన సదరు కార్పొరేటర్.. జూలై 14న బెయిల్‌పై బయటకొచ్చాడు. దీన్ని నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. జూలై 22న మహారాష్ట్ర అంతటా ఆస్పత్రుల్లో 24 గంటల షట్‌డౌన్ ఉంటుందని స్పష్టం చేసింది. ఈ సమయంలో అత్యవసర సేవా విభాగాలు మాత్రం యథావిధిగా పనిచేస్తాయని పేర్కొన్నది.