Promotions | హైదరాబాద్, జూలై7 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లో తాజాగా చేపట్టిన ప్రమోషన్లు, బదిలీల అంశం కొత్త రచ్చకు తెరలేపింది. సబార్డినేట్ రూల్స్‌కు వ్యతిరేకంగా ప్రమోషన్స్ కల్పిస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. స్టేట్ అండ్ సర్వీస్ సబార్డినేట్ రూల్స్ 1996కు భిన్నంగా సీనియార్టీ లిస్టులు తయారు చేయడమేంటని ఆయా సంఘాలు నిలదీస్తున్నాయి. వెంటనే నిబంధనల మేరకు ప్రమోషన్లు చేపట్టాలని, కామన్ సీనియార్టీ జాబితాను రూపొందించాలని డిమాండ్ చేస్తున్నాయి.
సబార్డినేట్ రూల్స్‌కు విరుద్ధంగా సీనియార్టీ..?
2016లో రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలను ప్రారంభించింది. అందులో బాలికల గురుకులాలు ఎక్కువగా, బాలుర గురుకులాలు తక్కువగా ఉన్నాయి. బాలుర, బాలికల గురుకుల సొసైటీల్లో సిబ్బంది నియామక మార్గదర్శకాలపై జీవో 1274 విడుదల చేసింది. దాని ప్రకారం బాలికల గురుకులాల్లో పూర్తిగా మహిళా ఉద్యోగులే ఉండాలని, బాలుర గురుకులాల్లో ఎవరైనా ఉండవచ్చని వెల్లడించింది.
అదే జీవోలో జనరల్ సూల్స్కు సంబంధించి నియామకానికి, గర్ల్స్‌కు సంబంధించి నియామకానికి వేర్వేరుగా రోస్టర్ పాయింట్లను రూపొందించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ కచ్చితంగా అమలు చేయాలని గత ప్రభుత్వం స్పష్టంగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. దాని ప్రకారమే 2018లో టీఎస్పీఎస్సీ, 2019లో ట్రిబ్ కొన్ని వేల మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లను 5గురుకుల సొసైటీలకు ఒకే నియామకం ద్వారా ఎంపిక చేశాయి.
రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అమలు చేయాలని ఉద్దేశంతోనే వేర్వేరుగా రోస్టర్ తయారు చేశారు. కానీ సొసైటీలు మాత్రం సీనియార్టీ ఫిక్సేషన్‌కు జీవో 1274ను అనుసరిస్తుండడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి. 1274 జీవో రిక్రూట్మెంట్కు మాత్రమేనని, సీనియార్టీ ఫిక్సేషన్‌కు పూర్తిగా స్టేట్ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ 1996 ప్రకారమే ఉండాలని స్పష్టం చేస్తున్నాయి.
కానీ సొసైటీలు బాలికల సూల్లో నియామకమైన వారికి బాలికల స్కూల్లోనే, జనరల్ స్కూల్స్‌లో నియామకమైన వారికి జనరల్ స్కూల్స్‌లోనే ప్రమోషన్స్ కల్పిస్తామని ప్రకటించడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి. దీనివల్ల మెరిట్లో ముందున్న మహిళా ఉపాధ్యాయులు, లెక్చరర్లు పూర్తిగా నష్టపోయే దుస్థితి ఏర్పడిందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు వాపోతున్నాయి.
అన్ని ప్రభుత్వశాఖల్లో ఒకే సీనియార్టీ జాబితాను తయారుచేస్తారని, ఎక్కడా 2 సీనియార్టీ లిస్ట్‌లు లేవని గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు అనేక తీర్పుల్లో స్పష్టంగా పేర్కొన్నాయని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఉదహరిస్తున్నాయి. సొసైటీ అధికారులకు ఈ అంశంపై ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్పష్టతనివ్వడం లేదని గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.
317 బదిలీలు చేపట్టకుండానే..
317 జీవో వల్ల డిస్లోకేటైన ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయం చేసిన తర్వాతనే సాధారణ బదిలీలను చేపడతామని ఎస్సీ గురుకుల సొసైటీ వెల్లడించింది. కానీ ప్రస్తుతం 317 బదిలీలు చేపట్టకుండానే సాధారణ బదిలీలు ఎలా చేస్తారని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ నిబంధన ప్రకారం బదిలీకి కనీసం 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి ఉండాలని, కానీ గురుకులాల్లో మాత్రం 8సంవత్సరాల సర్వీస్‌ను పూర్తిచేయాలనే నిబంధనను పెట్టారని నిప్పులు చెరుగుతున్నారు.
2018లో రిక్రూటైన టీచర్స్ ఇప్పటివరకు ఆరేండ్ల సీనియార్టీని కలిగి ఉన్నారని, వాళ్లు ఇప్పుడు అవకాశం కోల్పోతే ఒకటే సూల్లో 12 నుంచి13 సంవత్సరాల పని చేయాల్సి వస్తుందని గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సొసైటీలు వెంటనే తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని, లేదంటే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని గురుకుల ఉపాధ్యాయులు వేడుకుంటున్నారు.
కామన్ సీనియార్టీ ప్రకారమే ప్రమోషన్లు ఇవ్వాలి: టిగారియా
స్టేట్ సబార్డినేట్ రూల్స్ 1996 ప్రకారం కామన్ సీనియార్టీ లిస్టు తయారుచేసి మెరిట్ ఉన్నవారికి ప్రమోషన్స్ కల్పించాలని గురుకుల జేఏసీ డిమాండ్ చేసింది. జేఏసీ అధ్యక్షుడు మామిడి నారాయణ, జనరల్ సెక్రటరీ డాక్టర్ మధుసూదన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ అజయ్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జీవో 1274 రిక్రూట్మెంట్ వరకు మాత్రమేనని, సీనియార్టీ ఫిక్సేషన్‌కు పూర్తిగా మెరిట్‌నే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. అన్ని సొసైటీలకు ఒకే సర్వీస్ రూల్స్ ఉండేలా ప్రభుత్వం చొరవ చూపించాలని, ప్రమోషన్లలో కామన్ పాలసీ అమలు చేయాలని, మెరిట్‌ను సీనియార్టీని కాపాడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు.