Palle Prakruthi Vanam | నెక్కొండ, అక్టోబర్ 9 : నిన్నటి వరకు పచ్చని చెట్లతో కళకళలాడిన పల్లె ప్రకృతివనం మాయమైంది. గుర్తుతెలియని వ్యక్తులు డోజర్‌తో ప్రకృతివనాన్ని నామరూపాల్లేకుండా చేశారు. ఈ ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం చంద్రుగొండలో బుధవారం వెలుగులోకి వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మూడున్నరేండ్ల కిందట రూ.లక్షలు వెచ్చించి చంద్రుగొండ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. రూ.3.50 లక్షలతో దాదాపు 1,500 పూలు, పండ్ల మొక్కలను తీసుకొచ్చి నాటారు.
వనానికి ఫెన్సింగ్‌తోపాటు ఇతర ఖర్చులకు దాదాపు రూ.10 లక్షలు వెచ్చించినట్టు నాటి ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఏపుగా పెరిగిన చెట్లతో కళకళలాడిన పల్లె ప్రకృతి వనం ఆనవాళ్లు సైతం లేకుండా బుధవారం మధ్యాహ్నం డోజర్‌తో భూమిని చదును చేశారు. విషయం తెలుసుకున్న గ్రామ పంచాయతీ కార్యదర్శి సుమన్‌రెడ్డి.. ఎంపీడీవో దయాకర్, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు నెక్కొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.