కొడకండ్ల, అక్టోబర్ 13: దొంగ హామీలతో గద్దెనెక్కిన రేవంత్ సర్కారుపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తక్షణమే షరతులు లేకుండా రుణమాఫీ చేసి రైతులకు ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జీసీసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గాంధీనాయక్ జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నితండాలోని ఆయన నివాసంలో 48 గంటలపాటు ఉపవాస దీక్ష నిర్వహించగా, శనివారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రైతుబంధు స్థానంలో రైతుభరోసా ఇస్తామన్నారు.. కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం అన్నారు ఇప్పటివరకే ఏదీ లేదని ఎద్దేవా చేశారు.