నిజామాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతును ప్రభుత్వ ఉద్యోగిగా నమోదు చేసి రుణమాఫీకి మంగళంపాడిన వ్యవసాయశాఖ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దళిత రైతుకు జరిగిన అన్యాయంపై ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన సంచికలో ‘దళిత రైతుకు దగా’ శీర్షికన ప్రచురించిన కథనం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై సీఎంవో ఆరా తీసినట్టు తెలిసింది. వ్యవసాయశాఖ కమిషనర్ ఆదేశాలతో ఉరుకులు పరుగులు పెట్టిన అధికారులు కమిషనరేట్‌కు పూర్తి వివరాలతో నివేదికను సమర్పించినట్టు సమాచారం. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన రొడ్డ సుమన్ రైతేనని మండల వ్యవసాయాధికారి పద్మ క్షేత్ర స్థాయిలో పర్యటించి ధ్రువీకరించారు. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కూడా ఆయనకు అం దుతున్నట్టు తేల్చారు. పొరపాటు ఎలా జరిగిందో వ్యవసాయ శాఖ చెప్పడం లేదు. ‘నమస్తే’ కథనం వల్ల రొడ్డ సుమన్‌ను ప్రభుత్వం రైతుగా గుర్తించి రుణమాఫీకి అర్హుడిగా నిర్ధారించారు. సుమన్ పేరిట ఉన్న రూ.1.92 లక్షల రుణాన్ని ప్రభుత్వం మాఫీ చేసే అవకాశాలు ఉన్నాయి. రుణమాఫీ దక్కక తీవ్ర వేదనలో ఉన్న రొడ్డ సుమన్‌కు అండగా నిలిచిన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికను పలువురు రైతులు అభినందించారు.
‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన దళిత రైతుకు దగా కథనంపై కలెక్టర్ ఆదేశాలతో విచారణ చేశాం. రొడ్డ సుమన్ రైతే. అతను ప్రభుత్వ ఉద్యోగి కాదు. ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తున్నాం. బాధిత వ్యక్తికి రుణమాఫీ జరిగేలా చర్యలు తీసుకుంటాం. డేటా కరెక్షన్కు ప్రభుత్వం త్వరలోనే అవకాశం కల్పించేందుకు కృషి చేస్తున్నది. తద్వారా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.