హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): ‘వడ్డించేవాడు మనవాడయితే.. బంతి చివర్లో కూర్చున్నా కంచంలో అన్నీ వచ్చి చేరతాయనేది’.. పాత సామెత.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక నేతలను ప్రసన్నం చేసుకుంటే కాంట్రాక్టులేవైనా ఖాతాలో పడినట్టేనని జోరుగా చర్చ సాగుతున్నది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలు, గురుకులాలు, కస్తూర్బా స్కూళ్లు, సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లకు సరఫరా చేసే కోడిగుడ్ల కాంట్రాక్ట్ కోసం అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ, ముఖ్యనేత సోదరుడు చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తున్నది. నల్లగొండ జిల్లాకు చెందిన పౌల్ట్రీపామ్ వ్యాపారి అయిన ఓ ముఖ్యనేతకు అడ్డదారిలో కట్టబెట్టేందుకు యత్నిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సదరు ముఖ్యనేత చెరో రూ. 5 కోట్ల ముడుపులు ముట్టజెప్పినట్టు ప్రచారం జరుగుతున్నది. పదేపదే సచివాలయం చుట్టూ చక్కర్లు కొడుతూ టెండర్ నిబంధనలను సైతం తమకు అనుకూలంగా మార్చాలని అధికారులను ఇబ్బందిపెడుతున్నట్టు జోరు గా చర్చ జరుగుతున్నది. దిక్కుతోచని స్థితిలో సంబంధితశాఖ అధికారులు టెండర్లు ఫైనల్ చేయకుండా పలుమార్లు గడువు పొడిగించి చివరకు రద్దుచేయడం చర్చనీయాంశంగా మారింది. సదరు నేతల ఒత్తిడికి తలొగ్గే అధికారులు రద్దు నిర్ణయం తీసుకున్నట్టు పౌల్ట్రీ రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలోని 35,700 అంగన్వాడీ కేంద్రాలు, వెయ్యికిపైగా గురుకులాలు, 400 కస్తూర్బా స్కూళ్లు, వెయ్యికి పైగా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లకు ఏటా కోడిగుడ్లను సరఫరా చేస్తుంటారు. వీటికి డీ సెంట్రలైజ్డ్ విధానంలో ఏటా మార్చిలో టెండర్లు పిలుస్తుంటారు. నిబంధనలకు అనుగుణంగా టెండర్లు దాఖలు చేసి, తక్కువకు కోట్ చేసిన స్థానిక పౌల్ట్రీ రైతులకు అవకాశం కల్పిస్తారు. కానీ ప్రస్తుతం ఈ నిబంధనలు మార్చే కుట్రలకు తెరలేపారు. డీ సెంట్రలైజ్డ్ పద్ధతిని రద్దు చేసి సెంట్రలైజ్డ్ సిస్టం తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. మార్కెట్ రేట్లకు అనుగుణంగా కోడిగుడ్ల ధరను సైతం పెంచుకొనే వెసులుబాటు కల్పించేలా రూపొందిస్తున్నట్టు సమాచారం.
నల్లగొండకు చెందిన నాయకుడికి కోడిగుడ్ల కాంట్రాక్ట్ కట్టబెడతామని హామీ ఇచ్చి ముడుపులు తీసుకున్న నాయకులు ఈ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్లో కొనసాగి అనేక పదవులు నిర్వహించిన దక్షిణ తెలంగాణకు చెందిన ఓ అగ్రనేత కొడుకైన ఎంపీ, భూ కబ్జాల విషయంలో ‘అనకొండ’ అనే ఆరోపణలు ఎదుర్కొన్న ముఖ్యనేత సోదరుడు రంగంలోకి దిగారు. ముడుపులు ఇచ్చిన నేతను వెంటబెట్టుకొని తరుచూ సచివాలయానికి వెళ్తున్నట్టు తెలుస్తున్నది. మంత్రులతో పాటు నేరుగా ముఖ్యనేతతోనే రాయబారం నడుపుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. సదరు ముఖ్యనేత సైతం అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే గతంలో అంగన్వాడీలకు కోడిగుడ్ల సరఫరా కోసం పిలిచిన టెండర్లను క్యాన్సిల్ చేసినట్టు సమాచారం.
పౌల్ట్రీ బిజినెస్లో ఉన్న నల్లగొండకు చెందిన కాంగ్రెస్ నేత గతంలో భువనగిరి అసెంబ్లీ, పార్లమెంటరీ స్థానాల నుంచి పోటీకి విశ్వప్రయత్నం చేశారు. హస్తం పార్టీ టికెట్ కోసం దరఖాస్తుచేసుకొని ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేశారు. అయితే టికెట్ ఇవ్వడం సాధ్యం కాలేదు. అధికారంలోకి రాగానే ఆర్థికంగా మేలు చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఇదే విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్లో అగ్రజుడైన అదే జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతతో చెప్పించినట్టు సమాచారం. ఇందులో భాగంగానే మొదటిసారి ఎంపీగా గెలిచిన సదరు అగ్రనేత కొడుకు రంగంలోకి దిగారని తెలుస్తున్నది. నిబంధనలు మార్చితే తమకు అన్యాయం జరుగుతుందని నిజమైన పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు.