ఇటు సొంత సర్వే వెక్కిరింత ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. అటు ఎమ్మెల్యేల వేరుకుంపటి సెగ ఊపిరాడనివ్వడం లేదు. పక్క పార్టీ నుంచి పట్టుకొచ్చిన ఎమ్మెల్యేల పదవులు ఉంటయో ఊడుతయో తెలియని స్థితి ఒకవైపు, ఉన్న పార్టీలో ఉక్కపోతతో ఎప్పుడు బయటపడుదామా అని చూస్తున్నవారి సంకట స్థితి మరోవైపు! పదిమంది శాసనసభ్యుల రహస్య భేటీ వార్త కలకలం ఆగకముందే, వారికి మరో ముగ్గురూ జత కలిసినట్టు కొత్త సమాచారం. పార్టీలో పరిస్థితి ఇట్లుంటే, ప్రభుత్వం పరిస్థితి మరింత ఆగమాగం, అడివడివి! ఏడాదిలోనే ప్రజల ఏడ్పులు, ఎమ్మెల్యేల పెడబొబ్బలు!
తెలంగాణలో ఇప్పుడు ఏ దిక్కు చూసినా దిక్కుతోచని స్థితే! మార్పు మాటతో ఏమార్చి, అమలు చేయలేని హామీలతో ప్రజలను ప్రలోభపెట్టి పదవినెక్కిన కాంగ్రెస్.. ఇప్పుడు అలవిగాని స్థితిలో చిక్కుకున్నది. స్వయంకృతాపరాధాలతో తాను సమస్యల సుడిగుండంలో కూరుకుపోవడమే కాక, యావత్తు తెలంగాణనే సంక్షోభంలోకి నెట్టింది. ఒక ప్రభుత్వంగా ఏం చేయాలో, ఎట్ల చేయాలో తెలవని అసమర్థ నిర్వాకంతో రాష్ర్టాన్నే అయోమయంలో పడేసింది. వంకరటింకర చేష్టలతో కొక్కిరాయి పనులు చేసిన టక్కరి కాంగ్రెస్ ఇప్పుడు ముప్పేట ముట్టడిలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్నది.
ఆర్థికం అస్తవ్యస్తం! అన్నిరంగాలు ఛిన్నాభిన్నం! ఇచ్చిన హామీలు అమలు చేయలేక తలబొప్పి కట్టగా.. ఫిరాయింపులతో కోరితెచ్చుకున్న శిరోభారం అదనం! ఓవైపు కోర్టుల్లో ఎదురుదెబ్బలు.. మరోవైపు ప్రజాక్షేత్రంలో శాపనార్థాలు! నానాటికీ దిగజారుతున్న పరిపాలన. ప్రజల్లో వెల్లువెత్తుతున్న ప్రభుత్వ వ్యతిరేకత. ప్రజాపక్షమై పోరు సల్పుతున్న గులాబీదళం, ఇక తానూ రంగంలోకి దుంకనున్నట్టు కేసీఆర్ గర్జన!
Congress | ఇన్నింటి నడుమ దేన్ని ఎట్ల సగబెట్టాలో, ఎవరిని ఎదుర్కోవాలో తెల్వక కాంగ్రెస్ చేతులెత్తేస్తున్నది. డైవర్షన్ టాక్టిక్స్‌తో, మీడియా మేనేజ్మెంట్తో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎంత ప్రయత్నించినా, చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు క్షేత్రస్థాయిలో ఆ ఆటలను సాగనివ్వడం లేదు. అభయహస్తం అనుకున్నది కాస్తా తెలంగాణ పాలిట భయహస్తంగా మారిందనే విశ్లేషణలు వెల్లువెత్తుతున్న తరుణంలోనే, సుప్రీంకోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యలతో, ఫిరాయింపు ఎమ్మెల్యేల సీట్లకు త్వరలో ఉప ఎన్నికలు ఖాయమనే విశ్లేషణ కాంగ్రెస్ నెత్తిన పిడుగుపాటుగా మారింది! అసంతృప్త నేతల సంఖ్య పెరిగిపోతుంటే.. సీఎం, మంత్రులు అత్యవసర సమావేశాల్లో మునిగారు. పొలిటికల్ హీట్ ఫారన్‌హీట్ డిగ్రీల్లో పెరుగుతుంటే, ‘కమాండ్ కంట్రోల్’ నీలి పలకల ఏసీ గదిలోనూ చెమటలు పడుతున్నయి. కాళ్లకింద నేల కదులుతుందనే భయంతో చేస్తున్న డైవర్షన్ దందా, వెన్నులో వణుకును ఆపడం లేదు!!
నిజాయితీగా మాట్లాడుకుంటే క్షేత్ర స్థాయిలో మా ఖేల్ ఖతమైంది. ఆర్టీసీ వాళ్లు ఆల్రెడీ సమ్మె భేరి మోగించారు. డీఏలు, పీఆర్సీ కోసం ఉద్యోగులు కూడా ఎక్కువకాలం ఆగరు. వందరోజుల్లో అమలు చేస్తామని పథకాలు ప్రకటించినం. వందేండ్లయినా మేం వాటిని అమలు చేయలేమని ప్రజలకు అర్థమైంది. కాంగ్రెస్‌తో లాభం లేదని, వ్యవహారం చేయడం రాదని, వీళ్లను నమ్ముకుంటే ఉన్నది కూడా పోతుందని జనం ఇప్పటికే ఒక అంచనాకు వచ్చేశారు. ఏడాదిపాటు మౌనంగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు అదును చూసి పంజా విసురుతున్నరు. నా సుదీర్ఘ అనుభవంతో ఒక్కమాట చెప్త. మేం చక్రబంధంలో ఇరుక్కుపోయినం. ఇక లేసుడు కష్టం! -ఇది ఓ సీనియర్ కాంగ్రెస్ నేత మాట
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ముప్పేట దాడిలో చిక్కుకుని, తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు, వాటి పర్యవసానాలను గమనిస్తే, రాష్ట్రంలో పరిస్థితి ఆ పార్టీ అదుపులోంచి జారిపోతున్నదనే వాదన వినిపిస్తున్నది. దీన్ని చక్కదిద్దే శక్తి సామర్థ్యాలు కూడా కాంగ్రెస్ వద్ద కనిపించడం లేదంటున్నారు. “సాధారణంగా ఏ ప్రభుత్వానికైనా తొలి ఏడాది హనీమూన్ పీరియడ్వంటిది. ఆ సమయంలో కొన్ని పనులు చేయలేకపోయినా, తప్పులు చేసినా ప్రజలు పెద్దగా పట్టించుకోరు. మొన్ననే వచ్చారు కదా, కొంత సమయం ఇద్దామనే అభిప్రాయంతో ఉంటారు. కానీ దీనికి భిన్నంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే తీవ్రస్థాయి వ్యతిరేకతను మూటగట్టుకున్నది. ఇది అసాధారణ పరిణామం. దాదాపు అన్ని వర్గాల ప్రజలు, ఇక ఈ ప్రభుత్వంతో లాభం లేదనే అంచనాకు వచ్చారు.
మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విటర్(ఎక్స్)హ్యాండిల్ నిర్వహించిన సర్వేలో దాదాపు 70-80 శాతం మంది కాంగ్రెస్ పాలనను వ్యతిరేకించడమే దానికి ప్రతిబింబం. ఈ సర్వేతో కాంగ్రెస్‌కున్న కాస్త ఇజ్జత్ కూడా పోయింది” అని ప్రముఖ పాత్రికేయుడొకరు ఘాటుగా వ్యాఖ్యానించారు. “రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం బాగా లేదని చిన్నపిల్లగాడిని అడిగినా చెప్తరు. ఈ పరిస్థితిలో సర్వే నిర్వహించడమే పెద్ద తప్పు. ఓపెన్‌గా పెట్టడం మరో తప్పు. వచ్చిన ఫలితాన్ని హుందాగా అంగీకరించకుండా, తమకు సోషల్‌మీడియాలో బలం లేదని, బీఆర్ఎస్ హ్యాక్ చేసిందని కవర్ చేయడానికి ప్రయత్నించడం, ఎకసెక్కాలాడడం పార్టీని పూర్తిగా నవ్వుల పాల్జేసింది”అని కాంగ్రెస్‌కే చెందిన సోషల్ మీడియా ముఖ్యుడొకరు పేర్కొన్నారు. మొన్నటి సర్వేను, దాని ఫలితాలను ఆషామాషీగా తీసేయలేమని, తెలంగాణలో, ఆ మాటకొస్తే కాంగ్రెస్‌లో నెలకొన్న వాస్తవ పరిస్థితికి అది దర్పణమని అంటున్నారు. ఆ సర్వేలో దాదాపు 92 వేల మంది ఓటేశారు. ఇది తక్కువ సంఖ్యేం కాదు. అది కాంగ్రెస్ అఫీషియల్ హ్యాండిల్ కనుక పార్టీ సానుభూతిపరులే ఎక్కువగా పోల్‌లో పాల్గొంటారు. అటువంటి సర్వేలో, ‘ఫామ్‌హౌస్ పాలన కావాలా?’ అని ఎకసెక్కాల లీడింగ్ ప్రశ్న పెట్టినా, బీఆర్ఎస్కు 70 శాతానికి పైబడి మద్దతు రావడం, సర్వేలో మానిప్యులేషన్ ఏమీలేదని, ఆ వెంటనే మరో యూట్యూబ్ చానల్ నిర్వహించిన పోల్‌లో తేలడంతో వాస్తవ పరిస్థితికి ఇంతకు మించి నిదర్శనం ఏం కావాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్కిది ఘోర పరాభవంగా పరిగణిస్తున్నారు.
కాంగ్రెస్ పాలనలో తగ్గిన ఆదాయం నిజానికి ఈ సర్వే అనేది అన్నం ఉడికిందా లేదా చూసే ఒక మెతుకులాంటిదని, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. కాంగ్రెస్ చేతకానితనం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది.
“కేసీఆర్ హయాంలో పాటించిన ఆర్థిక క్రమశిక్షణ, పకడ్బందీ చర్యలతో ఏడాదికి దాదాపున 15 వేల కోట్ల దాకా రాష్ట్ర ఆదాయం పెరగగా, కాంగ్రెస్ పాలనలో మూడు క్వార్టర్లలోనే 12 వేల కోట్లు తగ్గినట్టు కాగ్ తేల్చింది. ఈ లెక్కన చివరి క్వార్టర్లో మరో 3 వేల కోట్లు, అంటే వెరసి 15 వేల కోట్లు తగ్గనుంది. పెరగాల్సిన 15 వేల కోట్లను, తగ్గిన 15 వేల కోట్లను కలిపితే రాష్ట్ర ఆదాయం 30 వేల కోట్లదాకా తగ్గింది” అని రిటైర్డ్ బ్యూరోక్రాట్ విశ్లేషించారు.
మరోవైపు ఏడాదిలో ఒక్క ప్రాజెక్టు చేపట్టకున్నా, నెలకు దాదాపు పదివేల కోట్ల చొప్పున 1.5 లక్షల కోట్ల అప్పుతెచ్చారు. ఆ పైసలు ఏం చేశారో అంతుబట్టడం లేదు. కేసీఆర్ హయాంలో ఒక వెలుగు వెలిగిన వ్యవసాయం, చేతి వృత్తులు, చేనేత, రియల్ ఎస్టేట్, గ్రామీణ- పట్టణాభివృద్ధి రంగాలన్నీ ఇప్పుడు సమస్యల వలయంలో కూరుకుపోయాయి. రైతులు, నేతన్నలు, ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు నిత్యకృత్యంగా మారిపోగా, ఇప్పుడు రియల్టర్ల బలిదానాలు కూడా మొదలయ్యా యి. ఇంత దారుణమైన పరిపాలనను ఎప్పు డూ చూడలేదు” అని రిటైర్డ్ బ్యూరోక్రాట్ ఒకరు విశ్లేషించారు. కేంద్ర ప్రభుత్వంలోని ఆర్థిక విభాగాల అధికారులు కూడా తెలంగాణ పర్ఫార్మెన్స్ వరస్ట్‌గా ఉందని చెబుతున్నట్టు ఆయన వెల్లడించారు. “నా సుదీర్ఘ అనుభవం ప్రకారం చూస్తే, కాంగ్రెస్ ఇచ్చిన ఇతర హామీల సంగతి దేవుడెరుగు, కేసీఆర్ సర్కారు నాటి పాత పథకాలను కూడా అమలు చేసే పరిస్థితి లేదు”అని ఆయన తేల్చిచెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న నష్టం కాంగ్రెస్ ముఖ్యులకు తెలుసని, దాన్ని ఎలా అడ్డుకోవలో వారికి అర్థం కావడం లేదని, ఆ ఫ్రస్ట్రేషన్‌లోనే బీఆర్ఎస్పై, కేసీఆర్‌పై తిట్లకు లంకించుకుంటున్నారని సీనియర్ పాత్రికేయుడొకరు పేర్కొన్నారు.
“నిన్న కేసీఆర్, తన ఫామ్‌హౌస్‌కు వచ్చిన కొంతమంది రైతులతో, కేవలం గంటసేపు మాటామంతి చేస్తే, దానిపై వెనువెంటనే సీఎం, పీసీసీ అధ్యక్షుడు సహా పది మంది నేతలు ప్రతిస్పందించడం, అసభ్య భాషలో తిట్టడం కాంగ్రెస్ బెరుకును, అభద్రతా భావాన్ని, ఫ్రస్ట్రేషన్‌ను పట్టి చూపించింది. పరిస్థితిని చక్కదిద్దడం ఎట్లనో తెల్వని కాంగ్రెస్ ముఖ్యులు, కేసీఆర్‌ను తిట్టడంలో పరిష్కారాన్ని వెతుక్కుంటున్నారు. దీనివల్ల టాపిక్ డైవర్ట్ అవుతుందని ఆశపడుతున్నారు” అని రిటైర్డ్ బ్యూరోక్రాట్ విశ్లేషించారు. “కానీ అదీ జరగడం లేదు. నిన్న కేసీఆర్ ప్రసంగం తర్వాత కాంగ్రెస్ ముఖ్యులు చేసిన వ్యాఖ్యలపై మేం క్విక్సర్వే నిర్వహించాం. ఊరికి 20 మంది చొప్పున ప్రతి ఉమ్మడి జిల్లాలోని రెండు ఊర్లలో ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాం. రెస్పాండెంట్స్లో 80 శాతం మంది కేసీఆర్‌ను తిట్టడం తప్పని కుండబద్దలు కొట్టారు”అని సర్వే నిర్వహణ సంస్థ ప్రతినిధి ఒకరు వివరించారు.
“కేసీఆర్ ఏదో ఆయనకు తోచింది చేసిండు. తెలంగాణ కోసం కొట్లాడిండు. ముఖ్యమంత్రి అయ్యాక అప్పోసప్పో చేసి మాకింత ఇచ్చిండు. నీకు అధికారమిస్తే, నువ్వేం చేయాల్నో చెయ్యక, ఆ పెద్దాయన్ను తిట్టడం ఎందుకు?”అని ఒక ముసలమ్మ రేవంత్‌పై చేసిన వ్యాఖ్య ప్రజల అభిప్రాయానికి దర్పణమని సర్వే నిర్వహణ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు.
ప్రజల్లో అభద్రత.. అసంతృప్తి పదేండ్లపాటు కడుపులో చల్ల కదలకుండా సుభద్రంగా ఉన్న తెలంగాణలో, ఇప్పుడు పల్లె పట్నం తేడా లేకుండా ఒకరకమైన అభద్రతా భావం ఏర్పడిందని, రేపు ఎట్లుంటదో అన్న ఆందోళన నెలకొందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. “రైతుల్లో భయం, రియల్టీలో భయం, వ్యాపార వర్గాల్లో భయం, వృత్తిదారుల్లో భయం, ఎస్సీ, ఎస్టీల్లో భయం, చిరుద్యోగుల్లో భయం, అధికారుల్లో భయం.. చివరికి పేదల కోసం తుపాకీ పట్టుకుని పోరాడే వామపక్షవాదుల్లో కూడా భయం భయం. ఎటుచూసినా భయం, భయం! అభయ హస్తం అంటూ అధికారంలోకి వచ్చినవారు ఇప్పుడు తెలంగాణ పాలిట భయహస్తంగా మారిపోయారు” అని తెలంగాణ సామాజికవేత్త ఒకరు వివరించారు. ఏడాది కిందటిదాకా తెలంగాణలో ఎకరం ఉంటే కోటీశ్వరుడిననే ధైర్యం ఉండేది. ఇప్పుడు భూముల ధరలు సగానికి సగం పడిపోయాయి. అయినా కొనేవారు లేరు. బిడ్డ పెండ్లో, అనారోగ్యమో వస్తే ఏం చేయాలని సగటు రైతులు భయపడుతున్నారు. ప్రభుత్వం వద్ద తాము దాచుకున్న సొమ్ము తమకు ఎప్పుడు వస్తుందని రిటైర్డ్ ఉద్యోగులు భయపడుతున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసమని కోర్టుల ముందు బారులు తీరుతున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ రైతులు తమకు ప్రభుత్వం ఎన్నడో ఇచ్చిన అసైన్డ్ భూములను ఏ బిగ్‌బ్రదర్ వచ్చి లాక్కుంటడోనని భయపడుతున్నరు. ధరణి తీసేసి, మళ్లీ కౌల్దారు కాలం, వీఆర్వో వ్యవస్థ తెస్తే తమ భూముల గతేమవుతుందోనని రైతులు భయపడుతున్నరు.
తమ పిల్లలను గురుకులాలకు పంపితే ఆరోగ్యం ఏమవుతుందోనని పేద తల్లిదండ్రులు భయపడుతున్నారు. ప్రభుత్వ దవాఖానల విషయంలో నేను రాను బిడ్డో అన్న భయం మళ్లీ మొదలైంది. ఏడెనిమిదేండ్ల పాటు నిరంతరాయ కరెంటుతో వెలుగులు విరజిమ్మిన పారిశ్రామిక, వ్యవసాయక రంగాలు ఇప్పుడు కోతల భయంతో సతమతమవుతున్నాయి. పేరుకుపోతున్న చెత్తచెదారంతో పెంట కుప్పలుగా మారిన పల్లె- పట్నం రోగాలు వస్తాయేమోనని భయపడుతున్నది. చివరికి పొద్దున్నే భగీరథ నీళ్లు వస్తాయన్న భరోసా లేని భయం. పరిపాలన బాగా లేదని తెల్లారి నిలదీద్దామంటే, చీకటికి ముందే పోలీసు లాఠీ ఇంటిముందు ప్రత్యక్షమై భయపెడుతున్నది”అని ఆయన వివరించారు. ఇక వ్యాపార వర్గాల గురించి చెప్తే చాటభారతమే!
“ప్రభుత్వ పెద్దల సన్నిహితులైన బిగ్ బ్రదర్స్ హైదరాబాద్‌లోని బిల్డర్లను పిలిపించుకుని, వారి ఆన్‌గోయింగ్ స్కీముల్లో రెండు మూడు తమకు రాసివ్వాల్సిందిగా బెదిరిస్తున్నారట. ఇప్పుడు తెలంగాణలో రైతు మొదలుకుని వ్యాపారి దాకా, బట్టల షాపు మొదలుకుని బంగారం దుకాణందాకా, పాన్ డబ్బా మొదలుకుని, ఫైవ్‌స్టార్ హోటల్దాకా అయితే నష్టం కాదంటే భయం రాజ్యమేలుతున్నది”అని విశ్రాంత పాత్రికేయుడొకరు వివరించారు.
“ఏడాది కిందటిదాకా, దాదాపు పదేండ్లు నిరంతరాయ కరెంటుతో, ఆగకుండా నడిచిన కర్మాగారాలతో, పచ్చని పైరు పంటలతో, భూముల అమ్మకంతో, భవితపై నమ్మకంతో, జనాల సవ్వడితో, కాసుల రువ్వడితో కళకళలాడిన తెలంగాణ ఇప్పుడు నిశ్చేతనమై నివ్వెరపోయి చూస్తున్నది. ప్రజల కండ్ల ముందు ఇవన్నీ కనిపిస్తున్నాయి. అందుకే హామీలన్నీ అమలుచేసేశాం, అంతా సుభిక్షంగా ఉంది అన్న పాలకపక్షం మాటల్ని ప్రజలు ఎంతమాత్రం నమ్మడం లేదు. దీనికి ప్రతిబింబమే, దాదాపు లక్షమంది పాల్గొన్న కాంగ్రెస్ సర్వేలో వచ్చిన ఫలితం. కేసీఆర్ పాలనే కావాలన్న నినాదం”అని ఆయన విశ్లేషించారు. ఏడాదిలో తెలంగాణ పదేండ్లు వెనకకు పోయిందనీ, ఒక్కమాటలో చెప్పాలంటే మళ్లీ 2014కు ముందునాటి పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన విశ్లేషించారు.
టెన్ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ లంచం ఒకప్పుడు నగదు నిల్వలతో విలసిల్లిన, కోట్ల రూపాయల లావాదేవీలు నడిపిన తెలంగాణ పల్లె- పట్నం జనం, ఇప్పుడు కాసుల కోసం కటకటలాడుతున్నారు. మార్కెట్లో పైసా పుట్టడం లేదని, లక్ష రూపాయలు కావాలంటే ఇచ్చే మనిషి కనిపించడం లేదని కాంగ్రెస్ నేతలే వాపోతున్నారు. ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలే దీనికి కారణమని ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. “తెలంగాణలో కేసీఆర్ ఒక అద్భుతమైన ఆర్థిక మాడల్ సృష్టించారు. రైతు బంధు, పింఛన్లు తదితర అనేక పథకాల రూపంలో ఆయన వేల కోట్ల ప్రభుత్వ నిధులను నెలవారీగా ప్రజా క్షేత్రంలోకి పంప్ చేసేవారు. దీనికి అదనంగా ప్రతి 10 కిలోమీటర్లకు ఒక డెవలప్మెంట్ సెంటర్‌ను సృష్టించేవారు. దీంతో ప్రజల వద్దకు చేరిన సొమ్ము లావాదేవీల్లో తిరిగి తిరిగీ అనేక రెట్లయ్యేది. ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయమూ వచ్చేది. పింఛన్లు సకాలంలో ఇవ్వకపోవడం, రైతుబంధును ఆపేయడం, అభివృద్ధి పథకాలను ఆపేయడం ద్వారా ప్రభుత్వం తనంతతానుగా ఈ ఎకనామిక్ సైకిల్ని విచ్ఛిన్నం చేసింది. దీనికి తోడు అంతులేని అవినీతి ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నది. స్థానిక అధికారి మొదలుకుని ప్రభుత్వ పెద్దల సన్నిహితుల దాకా ఇప్పుడు తెలంగాణ దోపిడీకి ఆటవిడుపుగా మారింది. ప్రభుత్వంలో ఎవరెవరు దుకాణాలు తెరిచారో, ఎంతెంత వసూలు చేస్తున్నారో పాత్రికేయులు బహిరంగంగానే చెట్ల కింద చర్చించుకుంటున్నారు” అని టీవీ చానళ్లలో ప్రముఖంగా కనిపించే ఒక ఆర్థిక వేత్త విశ్లేషించారు.
“ఫలానా మంత్రిగారి భార్యకు టెన్ పర్సెంట్ లంచం ఇచ్చి బిల్లు తెచ్చుకున్నా అని గ్రామీణ ప్రాంతాల్లోని కాంట్రాక్టర్లు మాట్లాడుకుంటున్నారంటే అవినీతి ఏ స్థాయిదాకా వెళ్లిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. మా పార్టీనా, పక్కపార్టీనా నాకు సంబంధం లేదు. డబ్బులిస్తేనే పని చేస్తా.. అని మరో మంత్రి కాంగ్రెస్ నాయకుల ముఖంమీదే తేల్చి చెబుతున్నారట. ఇక ఇంకో మంత్రి వద్దకు వెళ్తే 30 పర్సెంట్ ముడుపు తప్పనిసరి అని కాంగ్రెస్ నేతలే భయపడుతున్నారు. భూముల సమస్య పరిష్కారానికి వెళ్తే వాటా ఇవ్వకుండా తిరిగి రావడం అసాధ్యమని చెప్తున్నారు. ఇంత దారుణం ఎన్నడూ చూడలేదు” అని ప్రముఖ పత్రికకు చెందిన ఒక జర్నలిస్టు విస్తుపోయారు.
సీఎంలు 12 మంది.. బిగ్ బ్రదర్స్ అదనం నాలుక మీద నాయకులకు, పరిపాలన మీద ప్రభుత్వానికి పట్టు తప్పిందని, దాని ఫలితమే ఈ విపరిణామాలని ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న ఉత్తర తెలంగాణ సీనియర్ నాయకుడొకరు ఆక్రోశించారు. “మా వాళ్లకు అయితే అరుసుడు, లేదంటే కరుసుడు! ఎంతసేపూ రాజకీయం, డబ్బు సంపాదనే తప్ప పరిపాలన మీద దృష్టే లేదు. సబ్జెక్ట్ తెలుసుకోకుండానే డయాస్కెక్కి అజ్ఞానం బయటపెట్టుకుంటున్నరు.ఎవరికి వారే యమునా తీరే. ఏడాది గడిచినా ప్రభుత్వంలో టీమ్ వర్క్ లేదు. స్ట్రాటజీ లేదు. సబ్జెక్ట్ లేదు. సీఎంకు అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేదు. ఎవరూ ఎవరినీ అదుపుచేయలేని పరిస్థితి. కాంగ్రెస్‌లో సీఎంలు 12 మంది. బిగ్ బ్రదర్స్ వీరికి అదనం అని అధికారులు నవ్వుకుంటున్నరు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభంపై మంత్రి పొంగులేటి అనేక డేట్లు చెప్పారు. తర్వాత డిప్యూటీ సీఎం మరో డేట్ చెప్పారు. అవేవీ అమల్లోకి రాలేదు. డిసెంబర్ 28 నుంచి రైతు కూలీలకు 6 వేలు ఇస్తున్నట్టు భట్టి చెప్పారు. అదీ అమలు జరగలేదు. చివరికి సీఎం కూడా రైతు భరోసా ఎప్పుడు వేస్తామనేదానిపై నిముషాల్లోనే మాట మార్చారు. ఏ మంత్రి దేని గురించి ఎందుకు మాట్లాడుతరో, ఎందుకు డేట్ ప్రకటిస్తరో ఎవరికీ తెల్వదు. ఇదీ మా ప్రభుత్వం పని తీరు” అని ఏకి పారేశారు ఉత్తర తెలంగాణకు చెందిన ఒక సీనియర్ కాంగ్రెస్ నేత.
“ప్రభుత్వం సంగతి అంట్లుంటే ఇక పార్టీ సంగతి సరేసరి. మావాళ్ల భాష గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతమంచిది. ప్రతిపక్షంలో ఉండి తిట్టినమంటే అర్థముంది. పనిచేసి, ఫలితాలు చూపించాల్సిన ప్రభుత్వంలో మనం ఉండి, ప్రతిపక్షాన్ని తిడితే ఏం లాభం? దారుణం ఏమిటంటే ఎన్ని మోటు కూతలు తిడితే అంత పెద్ద లీడర్ అనుకుంటున్నరు మా వాళ్లు. పార్టీ నేతలే ప్రభుత్వ విధానాలను బహిరంగంగా తప్పుబడుతూ మాట్లాడుతున్నరు. సీఎం మాటకే లెక్కలేకుంటే ఇక పీసీసీ చీఫ్‌ను అడిగినోళ్లెవరు?” అని సీనియర్ కాంగ్రెస్ నేత ఆవేదన వ్యక్తంచేశారు. ఏడాదిలో ఇది చేసినం, ఈ రంగాన్ని సక్కబెట్టినం అని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నామని ఆయన ఆక్రోశించారు. “సొంత పార్టీ మంత్రులు, సొంత పార్టీ ఎమ్మెల్యేలను లంచం అడగడం, భూములు రాసివ్వాల్సిందిగా బ్లాక్మెయిల్ చేయడం ఎన్నడైనా విన్నామా? అది ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నం. అందుకే కడుపుమండిన ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు పెట్టుకుని మన గతేంది? భవిష్యత్తు ఏంది? అని చర్చించుకుంటున్నరు. ఇందులో వాళ్లను తప్పుబట్టేదేముంది? అని ఆయన నిలదీశారు.
“నిజాయతీగా మాట్లాడుకుంటే క్షేత్రస్థాయిలో మా ఖేల్ ఖతమైపోయింది. ఆర్టీసీ వాళ్లు ఆల్రెడీ సమ్మె భేరి మోగించారు. డీఏలు, పీఆర్సీ కోసం ఉద్యోగులు కూడా ఎక్కువ కాలం ఆగరు. వందరోజుల్లో అమలు చేస్తామని పథకాలు ప్రకటించాం. కానీ మేం వందేళ్లయినా వాటిని అమలు చేయలేమని ప్రజలకు అర్థమైంది. కాంగ్రెస్‌తో లాభం లేదని, వ్యవహారం చేయడం రాదని, వీళ్లను నమ్ముకుంటే ఉన్నది కూడా పోతుందని జనం ఇప్పటికే ఒక అంచనాకు వచ్చేశారు”అని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు విశ్లేషించారు.
పెట్టుబడి 15 వేల సంగతి దేవుడెరుగు, పాత పదివేల రైతుబంధైనా వస్తే చాలని దేవుళ్లకు మొక్కుకుంటున్నరు. తాము ఊర్లకు వెళ్లే పరిస్థితి లేదని, ఎక్కువ మాట్లాడితే జనం కొట్టేటట్టు ఉన్నారని మా నాయకులే చెప్తున్నరు. కాంగ్రెస్‌కు ఓటేసి తప్పుచేశాం అని జనం బహిరంగంగానే మాట్లాడుకుంటున్నరు. కాంగ్రెస్ ముఖ్యులతో దిగిన ఫొటోలను సెల్‌ఫోన్ డీపీలుగా పెట్టుకున్న మా కార్యకర్తలు, గుట్టుచప్పుడు కాకుండా వాటిని తీసేసుకుంటున్నరంటే అర్థం ఏమిటి? ఈ పరిస్థితిలో ఉప ఎన్నికలుగానీ వచ్చాయంటే మా గేమ్ ఓవర్. నిన్న సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలను, మూడ్ ఆఫ్‌ది కోర్ట్ని బట్టి చూస్తే, కొంచం ముందో వెనకో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడం, ఉప ఎన్నికలు రావడం తప్పదనిపిస్తున్నది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సహేతుక సమయంలో (నిర్ణీత స్వల్ప వ్యవధిలో) నిర్ణయం తీసుకోవాలని చెప్పిందే సుప్రీంకోర్టు. ఇప్పుడు దాని తీర్పును అదే వ్యతిరేకంగా నడుచుకోదు గదా! అందువల్ల ఉప ఎన్నికలు రావడం ఖాయం. మేం బొక్కబోర్లా పడడం అంతకన్నా ఖాయం. ప్రభుత్వంలో అవినీతి, దెబ్బతిన్న ఆర్థిక పరిస్థితి, పథకాలు అమలు చేయలేని అశక్తత, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, సొంత పార్టీలో అసమ్మతి, లీడర్లలో అసంతృప్తి, క్యాడర్లో నిరాసక్తత… ఇవన్నీ కళ్లకు కనిపిస్తున్న వాస్తవాలు. మేం చక్రబంధంలో ఇరుక్కుపోయినం. ఏడాది పాటు మౌనంగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు అదును చూసి పంజా విసురుతున్నరు. నా సుదీర్ఘ అనుభవంతో నేను ఒక్క మాట చెప్త. మేం కూరుకుపోయినం. లేసుడు కష్టం బై!” అంటూ సీట్లోంచి లేచారు సీనియర్ కాంగ్రెస్ నేత!!
బాకా మీడియా భజనకు కాలం చెల్లు మేము చూపించకపోతే ప్రజలకు నిజాలే తెలియవు.. అనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ‘భజన’ మీడియా చేస్తున్న కుప్పిగంతులు పాత్రికేయవర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. హస్తం పార్టీ బాకా మీడియా చేస్తున్న గిమ్మిక్కులు సాధారణ ప్రజలకూ ఇట్టే అర్థమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే ప్రజా సమస్యలు, అవినీతి అంశాలు తెరమీదకు రాగానే ఈ జేబుమీడియా సంస్థలు అప్రమత్తమై డైవర్షన్ గేమ్ మొదలుపెడుతున్నాయి. అసలు వార్తలను మరుగునపడేసేందుకు కొసరు వార్తలను పతాక శీర్షికలుగా, ప్రత్యేక కథనాలుగా వండి వారుస్తున్నాయి. కాంగ్రెస్‌కు కాపలా కాసేందుకు సదరు మీడియా సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ సోషల్‌మీడియా యుగంలో నేతలు మాట్లాడింది మాట్లాడినట్టు క్షణాల్లో జనంలోకి వెళ్లిపోతున్నది.
నాయకుల ముఖ కవళికలు, హావభావాలను బట్టి వారి మాటల్లో నిజానిజాలను, మాటల వెనుక ఉద్దేశాలను ప్రజలు అంచనా వేసే కాలమిది. ఇలాంటి పరిస్థితుల్లో నిజాలను దాచే ప్రయత్నం చేయడం నిప్పుతో చెలగాటం ఆడటం లాంటిదేనని, ఇలాంటి ప్రయత్నాలు ఎంతమాత్రం సాగవని ఒక సీనియర్ పాత్రికేయుడు అభిప్రాయపడ్డారు. అధికార పార్టీ అర్థరాత్రి ఇచ్చిన లీకులపై నిజానిజాలను నిర్ధారించుకోకుండా, ఎదుటి పక్షం వారి వివరణ కూడా తీసుకోకుండా వార్తలు ప్రచురిస్తున్న తీరు మా పత్రికలను అభాసుపాలు చేస్తున్నాయని వాటిల్లో పని చేసే పాత్రికేయులే వాపోతున్నారు. కొన్నిరోజుల క్రితం ప్రభుత్వవర్గాలు ఇచ్చిన ఒక వార్తను హెడ్డింగ్ కూడా మార్చకుండా రెండు ప్రధాన పత్రికలు ప్రచురించడం భావదారిద్య్రానికి నిదర్శనమని చెప్తున్నారు. కొన్ని నెలల క్రితం ప్రభుత్వంలోని ఒక ముఖ్యుడు ఓ పత్రికా కార్యాలయ రిపోర్టింగ్ విభాగానికి వెళ్లి ప్రభుత్వ అనుకూల వార్తలు ఎలా రాయాలో క్లాసు తీసుకున్నారని, ఇలాంటప్పుడు ఆ పత్రికలు రాసే వార్తలకు విశ్వసనీయత ఏముంటుందని పాత్రికేయ మిత్రులు ప్రశ్నిస్తున్నారు.
కుల వృత్తులు విలవిల కాంగ్రెస్ ఏడాది పాలనలో రాష్ట్రంలోని కుల వృత్తులు కుదేలయ్యాయని నిపుణులు చెప్తున్నారు. ఉదాహరణకు.. రాష్ట్రంలో చేపల పెంపకాన్ని ప్రోత్సహించడంతోపాటు మత్స్యకారులను ఆదుకునే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం ఉచిత చేపపిల్లల పంపిణీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. రిజర్వాయర్లు నిర్మించి, చెరువులు అభివృద్ధి చేయడం వల్ల తెలంగాణలో మత్స్య విప్లవం సాధ్యమైంది. దేశంలోనే ఇన్‌ల్యాండ్ ఆక్వాకల్చర్‌లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. కానీ.. కాంగ్రెస్ ఏడాది పాలనలో మత్స్య రంగం కుదేలైంది. ఓవైపు కాళేశ్వరం వంటి ప్రాజెక్టును పక్కనపెట్టడంతో జలవనరుల్లో నీళ్లు లేకపోవడం, మరోవైపు చేప పిల్లల పంపిణీపై ప్రభుత్వం దృష్టిపెట్టకపోవడం వల్ల మత్స్యరంగం దెబ్బతిన్నది. వాస్తవానికి ఏటా సెప్టెంబర్‌లో చేపపిల్లలను వదలాల్సి ఉండగా.. నిరుడు దాదాపు రెండు నెలలు ఆలస్యంగా నవంబర్‌లో చేపపిల్లలను వదిలారు. పైగా.. నాసిరకం చేప పిల్లల్ని చెరువుల్లో విడుదల చేశారని ఆరోపణలు వచ్చాయి.
కొన్నిచోట్ల చిన్న సైజు ఉన్నవాటిని వదిలితే, మరికొన్ని చోట్ల చనిపోయిన చేప పిల్లల్ని కూడా లెక్కలో కలిపి పంపిణీ చేసినట్టు విమర్శలు ఉన్నాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు తన నియోజకవర్గంలో చేపపిల్లలను వదిలేందుకు వెళ్లగా, నాసిరకంగా ఉండడం, సైజు చిన్నగా ఉండడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పంపిణీ చేయకుండానే వెళ్లిపోయారు. జగిత్యాల, మెదక్, సిద్దిపేట తదితర జిల్లాల్లోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా 80 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయగా, ప్రభుత్వం గత సీజన్లో 40 కోట్లు మాత్రమే పంపిణీ చేయాలని నిర్ణయించింది. అంటే అధికారికంగానే సగానికి తగ్గించారు. ఒక కిలోకు 250-300 చేప పిల్లలు ఉండాలని నిబంధనలు చెప్తుండగా.. 150 మాత్రమే వేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా 25 కోట్ల వరకు చేప పిల్లలు మాత్రమే పంపిణీ చేశారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.
‘రియల్’ బేజారు కేసీఆర్ పాలనలో సేవారంగం అద్భుత ప్రగతి సాధించిందని స్వయంగా కేంద్రం శుక్రవారం విడుదల చేసిన సోషియో ఎకనామిక్ సర్వే వెల్లడించింది. సేవా రంగంలో ఐటీతోపాటు రియల్ ఎస్టేట్ రంగం కీలకపాత్ర పోషించిందని నిపుణులు చెప్తున్నారు. ఓవైపు వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం, ప్రాజెక్టులు, కాలువల నిర్మాణం, టీఎస్ఐపాస్ వంటి విధానాలతో పరిశ్రమల స్థాపన, పెట్టుబడులు తీసుకురావడం.. తదితర కారణాల వల్ల గత పదేండ్లు రియల్ ఎస్టేట్ మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలుగొందిందని రియల్ ఎస్టేట్ నిపుణులు పేర్కొంటున్నారు.
“ఏడాదిన్నర కాలంగా రియల్ ఎస్టేట్ కుదేలయ్యింది. చివరికి బిల్డర్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఏ రకంగా ఉన్నదో ఊహించుకోవచ్చు. వ్యవసాయం కుదేలవడం, హైడ్రా, మూసీ కూల్చివేతలు, ట్రిపుల్ ఆర్ ట్యాక్స్, విచ్చలవిడి అవినీతి, కొత్త పెట్టుబడులు రాకపోవడం వంటి కారణాల వల్ల రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది. ధరణి పోర్టల్‌ను తీసేస్తామంటూ హడావుడిచేసినా అది సాధ్యం కాదని తేలిపోయింది. పైగా .. ఒకప్పుడు సవ్యంగా నడిచిన పోర్టల్ ఇప్పుడు సాంకేతిక సమస్యలతో సతమతం అవుతున్నది. ఇలా ఏడాది కాలంలో తీసుకున్న అసమర్థ విధానాలు, అవినీతితో రియల్ఎస్టేట్ రంగం కుప్పకూలిందని” నిపుణులు విశ్లేషించారు.
రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్లో కాగ్‌కు సమర్పించిన లెక్కల ప్రకారమే.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.18,228 కోట్ల ఆదాయం ఆశించగా 9 నెలల్లో రూ.7524 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే మూడోంతుల కాలం పూర్తయినా.. ఆదాయం సగం కూడా రాలేదన్నమాట.
రాబడి ఆగి.. అప్పులు పెరిగి..కాంగ్రెస్ ఏడాది పాలనకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రత్యక్ష ఉదాహరణ అని నిపుణులు పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ర్టా న్ని అప్పుల్లో ముంచిందని చెప్పిన కాంగ్రెస్.. 14 నెలల్లోనే ఏకంగా.. రూ.1.43 లక్షల కోట్లు అప్పులు చేసింది. ఆర్బీఐ నుంచి బాండ్ల వేలం ద్వారా దాదాపు రూ.62 వేల కోట్లు సేకరించగా, కార్పొరేషన్లు/ఎస్పీవీలకు గ్యారంటీలు ఇచ్చి రూ.62 వేల కోట్లు , గ్యారెంటీలు లేకుండా రూ.10 వేల కోట్లు, భూములు కుదువ పెట్టి మరో రూ.10వేల కోట్లు తీసుకున్నట్టు చెప్తున్నారు. ప్రభ్తుత్వం ప్రతీ నెల రూ.10 వేల కోట్ల అప్పులు చేసిందని, రాష్ట్ర ఆదాయం అంతకంతకూ పడిపోతున్నదని చెప్తున్నారు. కొవిడ్ కాలాన్ని మినహాయిస్తే.. తెలంగాణ రాష్ట్ర ఆదాయం పాజిటివ్ వృద్ధిలో కొనసాగగా.. కాంగ్రెస్ ఏడాది పాలనలో రాబడులు మైనస్‌లోకి వెళ్లినట్టు చెప్తున్నారు. డిసెంబర్లో ప్రభుత్వం కాగ్‌కు సమర్పించిన లెక్కల ప్రకారమే.. నిరుడితో పోల్చితే రెవెన్యూ రాబడుల్లో రూ.12వేల కోట్ల లోటు ఉన్నదని అంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరికి ఇది రూ.15వేల కోట్లు దాటిపోతుందని చెప్తున్నారు. సాధారణంగా ఏటికేడు రూ.15వేల కోట్ల వృద్ధి నమోదుకావాల్సింది పోయి.. లోటు నమోదైందని తెలిపారు. మొత్తంగా ఏడాది కాలంలో రూ.30 వేల కోట్లు నష్టపోయినట్టేనని చెప్తున్నారు.
మళ్లీ చేనేత కార్మికుల ఆత్మహత్యలు
యాదవుల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టింది. తొలి విడతలో దాదాపు 4 లక్షల మంది లబ్ధిదారులకు 82.64 లక్షల గొర్రెలు పంపిణీ చేశారు. వాటి సంతతి పెరగడం ద్వారా రూ.8వేల కోట్ల ఆదాయం సృష్టించినట్టయిందని, మాంసం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ ఎదిగిందని గణాంకాలు చెప్తున్నాయి. రెండో విడతలో 3.38 లక్షల మందికి గొర్రెలు పంపిణీ చేసేందుకు 2023లో శ్రీకారం చుట్టింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేయడంతో వారంతా యూనిట్లు రాక, కట్టిన డబ్బులు వెనక్కిరాక అవస్థలు పడుతున్నారు. యాదవుల అభివృద్ధి ఆగిపోయింది. ఇక రాష్ట్రంలో చేనేత కార్మికుల పరిస్థితి మరింత దయనీయం. బతుకమ్మ చీరలు, స్కూల్ పిల్లలకు దుస్తులు, రాయితీలు, బీమా సౌకర్యం వంటి అనేక చర్యలతో బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత కార్మికులకు భరోసా కల్పించింది. ముఖ్యంగా బతుకమ్మ చీరల పథకం కోసం 2017-2023 మధ్య రూ.2,157 కోట్లు కేటాయించడంతో చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయాయి.
కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బతుకమ్మ చీరలు బంద్ చేయడంతో చేనేత రంగం కుదేలయ్యింది. పని లేకపోవడం, రాయితీలు ఇవ్వకపోవడంతో అప్పుల భారం పెరిగి మళ్లీ చేనేతల ఆత్మహత్యలు మొదలయ్యాయి. కల్లు గీత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు కేసీఆర్ ప్రభత్వం కల్లు దుకాణాలను తిరిగి తెరిపించింది. బీమా సౌకర్యం కల్పించి, చెట్ల పన్నులు రద్దు చేసింది. కానీ.. గత ఏడాది కాలంగా కల్లు దుకాణాలపై అధికారుల దాడులు ఎక్కువయ్యాయని, కేసులు నమోదు చేస్తున్నారని గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కులవృత్తులపై ఆధారపడిన వారికి చేయూత అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ‘బీసీ బంధు’ పథకాన్ని ప్రారంభించింది. వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.29 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, దాదాపు 50 వేల మందికి సాయం అందించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సాయాన్ని నిలిపివేసింది.
దళితులకు మొండి చెయ్యి
దళితుల బతుకుల్లో వెలుగులు చూడాలని కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు పథకానికి రూపకల్పన చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చే పథకాన్ని 2021లో ప్రారంభించింది. 44వేల కుటుంబాలకు పథకాన్ని అమలు చేసింది. సుమారు రూ.4,400 కోట్లు ఖర్చు చేసింది. తాము అధికారంలోకి వస్తే దళిత బంధు పథకం సాయాన్ని రూ.12 లక్షలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ గద్దెనెక్కిన తర్వాత పూర్తిగా పథకాన్ని పక్కన పెట్టేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన 10,408 మంది లబ్ధిదారులకు చెందిన రూ.335 కోట్లను కూడా బ్యాంకుల్లో ఫ్రీజ్ చేసింది. పోరాటాలు, ఉద్యమాలకు దిగివచ్చి దాదాపు 14 నెలల తర్వాత వాటిని విడుదల చేసింది. మిగతావారికి పథకాన్ని అమలు చేస్తారో లేదో ఇప్పటివరకు చెప్పడం లేదు. మరోవైపు.. సుప్రీంకోర్టు నిరుడు ఆగస్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. వెంటనే వర్గీకరణ అమలు చేస్తామని అదేరోజు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత దాని ఊసే మరిచిపోయారని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆరు నెలలు గడిచినా ఇప్పటివరకు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదని విమర్శిస్తున్నాయి. సబ్ కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడుతున్నాయి.
రైతులకు ‘ఉమ్మడి’ రోజులు యాదికి..
దుక్కి దున్నే సమయానికే ఖాతాల్లోకి ఎకరాకు రూ.10వేల పెట్టుబడి సాయం, అవసరానికి తగినన్ని ఎరువులు, బోర్లలో నిండా నీళ్లు, 24 గంటలు నాణ్యమైన కరంటు, పచ్చగా పంటలు, పండించిన ప్రతి గింజ కొనుగోలు, రెండుమూడు రోజుల్లోనే ఖాతాల్లోకి నిధులు పడటం.. కొన్నేండ్లుగా తెలంగాణ రైతులకు అలవాటైన విధానం ఇది. దాదాపు పదేండ్లుగా సౌకర్యంగా ఉన్న రైతుల పరిస్థితి కాంగ్రెస్ పాలనలో ఏడాది కాలంలోనే రివర్స్ అయ్యిందని విశ్లేషకులు చెప్తున్నారు. రైతుభరోసా పేరుతో రూ.15వేలు ఇస్తామని ఆశపెట్టి ఆగం చేశారని వాపోతున్నారు. ఒకసారి పూర్తిగా ఎగ్గొట్టారని, మరోసారి కాలం పూర్తయిన తర్వాత వేశారని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు రూ.15వేల నుంచి రూ.12వేలకు తగ్గించి మోసం చేశారని మండిపడుతున్నారు.
అది కూడా వేయడం లేదన్నారు. మరోవైపు ఎరువుల కోసం రైతులు బారులు తీరాల్సిన పరిస్థితి నెలకొన్నది. చెప్పులు, పాస్‌బుక్‌లు లైన్లో పెట్టే స్థితికి చేరింది. కాళేశ్వరంను కావాలనే ఎండబెట్టడంతో సాగునీరు కరువయ్యిందని, ఒకప్పుడు ఎండాకాలంలోనూ నిండుగా ఉన్న చెరువులు ఇప్పుడు ఎండిపోయే స్థితికి చేరుకున్నాయని అంటున్నారు. బోర్లలో నీళ్లు అడుగంటాయన్నారు. అయినా అష్టకష్టాలు పడి పంటలు పండిస్తే.. కొనుగోలు ఆలస్యం చేయడంతో అకాల వర్షాలతో నష్టపోయారు. ఇలా గత 14 నెలల పాలనలో వ్యవసాయ రంగం కుదేలైందని, రైతులు ఆగమయ్యారని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే రాష్ట్రంలో 2014కు ముందు పరిస్థితులు నెలకొన్నాయని చెప్తున్నారు.
నిర్లక్ష్యానికి పరాకాష్టగా గురుకులాలు
పేదలకు కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం వెయ్యికిపైగా గురుకులాలను ప్రారంభించింది. ఉత్తమ బోధన, ఉత్తమ వసతులతో దేశంలోనే మంచి పేరు సంపాదించాయి. కానీ.. ఏడాది కాలంలో గురుకులాలు ఆగమయ్యాయని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 14 నెలల్లోనే సుమారు 40కిపైగా ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగుచూశాయని, ఆత్మహత్యలు, విషాహార ఘటనలతో 50కిపైగా మంది విద్యార్థులు మరణించారని చెప్తున్నారు. మరోవైపు కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రారంభించిన సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అటకెక్కించింది.
నాడు మన ఊరు-మన బడి కింద స్కూల్ భవనాల అభివృద్ధి చేపట్టగా.. ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలలుగా పేరు మార్చింది. కానీ పనులు కొనసాగించలేదు. పైగా రూ.1100 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో పెట్టింది. దీంతో వసతుల కల్పన అర్ధంతరంగా నిలిచిపోయింది. ఇక ఏడాదంతా విద్యారంగంలో ధర్నాలు, సమ్మెలు కొనసాగాయన్నారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు తమ డిమాండ్ల కోసం ఏకంగా 28 రోజులు సమ్మె చేశారని, గిరిజన పాఠశాల్లలో సీఆర్టీలు ధర్నా చేశారని, మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు బిల్లులు చెల్లించకపోవడంతో ధర్నాలు చేయాల్సి వచ్చిందని గుర్తు చేస్తున్నారు. పాఠశాలలకు ఉచిత విద్యుత్ అని చెప్పినా అమలు కావడం లేదని, ఇప్పటికీ జీరో బిల్లులు రావడం లేదన్నారు.