హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): బిడ్డర్లు అభ్యర్థనల మేరకే సిమెంట్, స్టీల్ ధరలను కాంట్రాక్టర్ల పరిధిలోకి చేర్చామని, తద్వారా ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం నామమాత్రమేనని టీజీ జెన్కో వెల్లడించింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల సివిల్ పనులకు సంబంధించి టెండర్లలో సిమెంట్, స్టీల్ ధరను కాంట్రాక్టర్ల పరిధిలోకి కొత్తగా తీసుకొచ్చారు. దీంతో వేలాది కోట్ల రూపాయల భారం పడుతుందనే విమర్శలున్నాయి.
ఇదే విషయమై ‘ప్రజాధనం లూటీకి రంగం సిద్ధం’ పేరిట ‘నమస్తే తెలంగాణ’ సోమవారం కథనం ప్రచురితమైంది. దీనిపై జెన్కో స్పందించింది. జెన్కో పరిధిలో రూ.928.52 కోట్ల విలువైన సివిల్ పనులకు 9సార్లు టెండర్లు ఆహ్వానించినా ఎవరూ ముందుకు రాలేదని పేర్కొన్నది. ప్రీ-బిడ్ సమావేశాన్ని నిర్వహించగా, మార్కెట్ మార్పులను పరిగణనలోకి తీసుకుని ధర మార్పు నిబంధనను చేర్చాలని బిడ్డర్లు అభ్యర్థించారని తెలిపింది.