హైదరాబాద్, మార్చి 30(నమస్తే తెలంగాణ): దేశజనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బీసీల సమస్యల పరిష్కారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. సోమవారం ఢిల్లీలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య ఏర్పాటుచేసిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట 56 హామీలిచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటినా అమలుచేయలేదని మండిపడ్డారు.
రాష్ట్ర జనాభాలో సింహభాగం ఉన్న మున్నూరుకాపు, యాదవ, కుర్మ, రజక కులాలకు మంత్రివర్గంలో చోటివ్వకపోవడం శోచనీయమని ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ల హామీని అటకెక్కించిందని దుయ్యబట్టారు. బడ్జెట్లో ఏటా రూ.20వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి మోసం చేసిందని విరుచుకుపడ్డారు. 42శాతం కోటా కోసం తాను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లుకు పార్టీలకతీతంగా మద్దతివ్వాలని ఎంపీలను కోరారు. సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ వీ హనుమంతరావు, బీజేపీ నేత ఉప్పు రవీందర్ ప్రసంగించారు.
కేంద్ర సాయుధ పోలీసు బలగాలు(సీఏపీఎఫ్) దేశ అంతర్గత భద్రతకు వెన్నుముక అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అభిప్రాయపడ్డారు. సోమవారం రాజ్యసభలో ‘కేంద్ర సాయుధ పోలీసు బలగాల సాధారణ పరిపాలన బిల్లు-2026’పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్, ఐటీబీపీ, ఎస్ఎస్ఎస్బీ తదితర బలగాలు దేశ సరిహద్దులు కాపాడటం, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడం, చట్టవ్యవస్థను పరిరక్షించడం వంటి కీలక బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తున్నాయన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో భద్రత వ్యవస్థను ఆధునీకరించేందుకు తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా రాజ్యసభలో వివరించారు. ఆధునిక వాహనాలు, ఆయుధాలు, సర్వైలెన్స్, ఇంటెలిజెన్స్ వ్యవస్థల శాంతిభద్రతలను సమర్థంగా ఎదుర్కొన్నట్టు తెలిపారు.