జహీరాబాద్, జూలై 25: వందలాది ఎకరాల ఆయకట్టుకు నీరందించడంతో పాటు పలు గ్రామాల ప్రజలకు కీలక నీటి వనరుగా ఉన్న హద్నూర్ పెద్ద చెరువు ఆక్రమణకు గురై రోజురోజుకు కుచించుకు పోతున్నది. నీటిపారుదలశాఖ అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల పట్టింపులేనితనంతో చెరువు దెబ్బతిని కళను కోల్పోతున్నది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హద్నూర్లో 130 ఎకరాల్లో తవ్వించిన పెద్ద చెరువులో నీటి నిల్వ సామర్ధ్యం తగ్గడంతో రైతులు,మత్స్యకారులు, ఆయా గ్రామాల ప్రజలకు నష్టం జరుగుతున్నది.
50 ఏండ్ల క్రితం తవ్వించిన హద్నూర్ పెద్ద చెరువు కింద కుడి, ఎడమ కాల్వ ద్వారా వందలాది ఎకరాలకు సాగుకు నీరు అందింది. కాల్వలకు ఏర్పడిన లీకేజీలతో ఆయకట్టుకు ప్రస్తుతం సాగునీరు సరిగ్గా అందడం లేదు.ఈ విషయాన్ని స్థానికులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా కాల్వలకు మరమ్మతులు చేపట్టడం లేదు. కొందరు అక్రమార్కులు చెరువు పరిసరాలను చెరబడుతున్నారు. హద్నూర్ పెద్ద చెరువు కట్టపై ముళ్లపొదలు, చెట్లు ఏఫుగా పెరిగాయి. గ్రావెలింగ్ దెబ్బతిన్నది. చెరువు కట్టపైన పలుచోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. చెరువు మరమ్మతుల కోసం సంబంధిత అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపినప్పటికీ నిధులు మంజూరు కావడం లేదు. చెరువు నిండా నీరు ఉంటే అటు మత్స్యకారులు, ఇటు రైతులకు ఉపయోగపడేది.
పర్క్‌లేషన్ ట్యాంకుగా మార్చినా…
గతంలో గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు విజ్ఞప్తితో ప్రభుత్వం చెరువును పర్కులేషన్ ట్యాంకుగా మార్చింది. ఆ తర్వాత చెరువులో నీరు నిలవడంతో భూగర్భజలాలు పెరిగి బోరు, బావుల్లో పుష్కలంగా నీరు లభించడంతో రైతులు పంటలు బాగా పండించుకున్నారు. తాగునీటికి కొరత లేకుండా పోయింది. సమైక్య పాలనలో హద్నూర పెద్ద చెరువు బాగోగులను పట్టించుకోలేదు. కాలక్రమేణా చెరువులో పూడిక మట్టి పేరుకుపోయి నీటి నిల్వ సామర్ధ్యం తగ్గింది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా చెరువు పూర్తిగా నిండడం లేదు. దీంతో చెరువు పరిధిలోని బోరు, బావుల్లో భూగర్భజలాలు తగ్గి సాగు, తాగునీటి కొరత ఏర్పడింది.
బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి..
బీఆర్ఎస్ పా లనలో మిషన్ కాకతీయ పథకంలో రూ. 81లక్షలతో హద్నూర పెద్ద చెరువును పునరుద్ధరించారు. చెరువులో పూడిక తీయడంతో నీటినిల్వ సామర్థ్యం పెరిగింది. భూగర్భజలాలు వృద్ధి చెందాయి. ఫలితంగా న్యాల్కల్ మండలంలోని హద్నూర్, గుంజోట్టి, రాంతీర్థం, వడ్డి, హుసేల్లి, అత్నూర్, రుక్మాపూర్, న్యాల్కల్ గ్రామాల రైతులకు ఉపయోగపడింది. రెండు, మూడేండ్లుగా సంబంధిత అధికారులు నిర్వహణ మరువడంతో ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. చెరువుకు నిర్థిష్టమైన హద్దులు లేక పరిసరాలను అక్రమార్కులు యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు.
మరో వైపు మండలంలోని పలు గ్రామాల పరిధిలోని వాగులు, వంకల నుంచి హద్నూర పెద్ద చెరువులోకి వచ్చే వరదను కొందరూ ఫామ్‌హౌస్‌ల పరిసరాల్లో చెక్‌డ్యామ్‌లు నిర్మించి అడ్డుకుంటున్నారు. దీంతో అక్కడి చెక్‌డ్యామ్‌లు వరదతో పొంగిపొర్లితే తప్పా పెద్ద చెరువులోకి నీరు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో చెరువు పరిసరాల్లోని ఆయా గ్రామాల పరిధిలోని బోరు, బావుల్లో భూగర్భజలాలు అడుగంటి ప్రజలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువు మరమ్మతులు చేయడంతో పాటు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు.