చేర్యాల, జూలై 25: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని భక్తులు మండిపడుతున్నారు. ఆయా రాష్ర్టాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం ప్రసాద్ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకంలో ఎంపికైన పుణ్యక్షేత్రం, పర్యాటక స్థలాలకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ నిధులు మంజూరు చేస్తుంది.కేంద్రం మంజూరు చేసిన నిధులతో ఆయా క్షేత్రాల్లో భక్తుల కోసం ప్రత్యేక నిర్మాణాలు, క్యూలైన్లు, విశ్రాంతి గదులు, కాటేజీలు, పార్కింగ్, టాయిలెట్స్, రోడ్ల నిర్మాణం, తాగునీటి కల్పన వంటి సౌకర్యాలు కల్పిస్తారు.
కానీ, రాష్ట్రంలో ఆరు ప్రముఖ ఆలయాల్లో ఒక్కటైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయాన్ని ప్రసాద్ పథకంలో చేర్చడంలో కేంద్ర మంత్రులు నిర్లక్ష్యం వహించారు. రాష్ట్ర బీజేపీలో ప్రముఖ పాత్ర పోషించే మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు రఘునందన్‌రావు, లక్ష్మణ్ తదితరులు కొమురవెల్లి మల్లన్న ఆలయానికి వచ్చిన సమయంలో మల్లన్న భక్తులు, వివిధ పార్టీల నాయకులు సైతం మల్లన్న క్షేత్రాన్ని ప్రసాద్ పథకంలో చేర్చి అభివృద్ధి చేయాలని వినతిపత్రాలు అందించినా వారు స్పందించలేదు. మల్లన్న పేరిట ఏర్పాటు చేసిన రైల్వేస్టేషన్ ప్రారంభించేందుకు వస్తున్న కేంద్ర మంత్రులు స్పం దించి మల్లన్న క్షేత్రాన్ని ప్రసాద్ పథకంలో చేర్చాలని భక్తులు కోరుతున్నారు.
కేసీఆర్ పాలనలోనే రైల్వేలైన్‌కు మోక్షం
కేసీఆర్ పాలనలో మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ నిర్మాణం కోసం రాష్ట్ర ఖజానా నుంచి నిధులు సైతం మంజూరు చేశారు. సర్వే నిర్వహించి భూ సేకరించి చేయడంతో రైల్వే లైన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా తలపెట్టిన రైల్వే స్టేషన్లు, రేక్‌పాయింట్ల సమయంలోనే కొమురవెల్లి వద్ద రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయాలని మల్లన్న ఆలయ వర్గాలతో పాటు భక్తులు బీజేపీ పెద్దలను హైదరాబాద్‌లో కలిసి వినతి పత్రాలు సమర్పించారు. మొదటి విడతలో కొమురవెల్లిలో రైలు ఆగకుండా వెళ్లిపోయింది.
అనంతరం మల్లన్న ఆలయానికి చెందిన ప్రధాన వ్యక్తితో పాటు కొందరు భక్తులు హైదరాబాద్, ఢిల్లీ వరకు వెళ్లి అధికారులను కలిసి రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయడంతో కలిగే లాభాలతో పాటు భక్తులకు ఏర్పడే వసతులపై చర్చించడంతో అధికారులు స్పందించి ఎట్టకేలకు కొమురవెల్లి పుణ్యక్షేత్రం పేరిట రైల్వే హాల్ట్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. మల్లన్న స్వామి పేరిట రైల్వేస్టేషన్ నిర్మించారు. దానిని ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రులు స్పందించి రెండు లైన్ల నిర్మాణ పనుల కోసం నిధులు కేటాయిస్తే సికింద్రాబాద్ టూ కరీంనగర్ ప్రయాణికులతో పాటు భక్తులకు ఉపయోగపడుతుంది. గతంలో రైల్వే లైన్ డబ్లింగ్ పనుల కోసం ఓ సర్వే సైతం సంబంధిత శాఖ అధికారులు నిర్వహించినప్పటికీ దానికి మోక్షం కలగలేదు. అమృత్ భారత్ పథకంలో కొమురవెల్లి మల్లన్న రైల్వేస్టేషన్‌ను చేర్చితే భక్తులు, ప్రయాణికులకు మరిన్ని వసతులు చేకూరే అవకాశం ఉంది.