RTI | హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వంలో పారదర్శకత లోపించింది. ప్రభుత్వాన్ని ఆర్టీఐ ద్వారా ఏ సమాచారం అడిగినా ‘లేదు’ అనే సమాధానం వస్తున్నది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, వాటికి కేటాయించిన నిధులపై కూడా సమాచారాన్ని దాచిపెడుతున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత పథకాల ప్రచారానికి, ప్రభుత్వ ప్రచారానికి ఎన్ని నిధులు కేటాయించారు? ఎంత ఖర్చు చేశారు? అంటే సమాధానం లేదు. పాలనాపగ్గాలు చేపట్టిన నాటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇప్పటివరకు హస్తినకు 20 సార్లు వెళ్లారు.
ఒక్కసారి సీఎం బృందం ఢిల్లీ పర్యటనకు ఎంతవుతున్నది? ఇప్పటివరకు ఎంతయింది? అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మౌనమే సమాధానం. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తీసుకొనే అధికారం సమాచార హకు చట్టం (ఆర్టీఐ) కల్పించింది. కానీ, ఆర్టీఐ కింద దరఖాస్తు చేసినా రేవంత్ సర్కారు సమాచారం దాటవేస్తున్నది. ఆర్టీఐ కింద సమాచారం కోరినా అధికారులు ఇవ్వడం లేదు. కొన్ని తప్పనిసరి సందర్భాల్లో ఇచ్చినా సమాచారం అరకొరగానే ఉంటున్నది. అధికారం చేపట్టిన ఎనిమిది నెలల్లో అనేక ఆర్టీఐ దరఖాస్తులు అధికారుల వద్ద పెండింగ్లో ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వంలో జవాబుదారీతనం కనిపించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఎనిమిది నెలలైనా సమాచార కమిషన్ల నియామకం లేదు. సమాచారం అడిగితే దాపరికం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ప్రజాస్వామ్య దేశంలో పౌరుల ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి. అప్పడే పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం ఉన్నట్టు. రహస్యం, దాపరికం ఉంటే అది ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం.
-రాజేంద్ర, ఫౌండర్ యూత్ ఫర్ యాంటీ కరప్షన్