Gurukula Recruitment | హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గురుకుల ఉద్యోగం కోసం పరీక్ష రాసిన అభ్యర్థుల పరిస్థితి దయనీయంగా మారింది. అసలు ఆ ఉద్యోగాలకు వారు ఎందుకు ఎంపిక కాలేదో ఇప్పటికీ తెలియడం లేదు. ఈ రాత పరీక్షను నిర్వహించిన తెలంగాణ రెసిడిన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు(ట్రిబ్) ఇప్పటివరకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ (జీఆర్ఎల్)ను ప్రకటించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో అభ్యర్థులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. వారు ఎక్కడ ఎలాంటి పొరపాట్లు చేశారో? ఏ కారణం వల్ల ఉద్యోగాలు రాలేదో తెలియక మథనపడుతున్నారు. జీఆర్‌ఎల్‌ను ప్రకటించాలని అభ్యర్థులు కోరుతున్నప్పటికీ ఏ రిక్రూట్మెంట్ బోర్డులోనూ లేనివిధంగా మొత్తం నియామక ప్రక్రియ పూర్తయ్యేవరకూ ప్రకటించబోమని ట్రిబ్ తేల్చిచెప్తుండటం అనేక అనుమానాలకు తావిస్తున్నది. దీంతో పారదర్శకతను పాటించడమంటే ఇదేనా? అని అభ్యర్థులు నిలదీస్తున్నారు. ఇతర బోర్డులు పూర్తిగా పారదర్శకంగా వ్యవహరిస్తుంటే అందుకు విరుద్ధంగా ట్రిబ్ వ్యవహరిస్తున్నదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా రాతపరీక్షకు సంబంధిం చి తొలుత సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 1ః2 ని ష్పత్తిలో అభ్యర్థులను ఆహ్వానిస్తారు. అనంతరం ఎంపికైన అభ్యర్థులకు సంబంధించి 1ః1 నిష్పత్తిలో జాబితాను ప్రకటిస్తారు. ఆ సందర్భంగా పోస్టుకు ఎంపికైన అభ్యర్థి హాల్‌టికెట్ నంబర్, రాతపరీక్షలో సాధించిన జనరల్ ర్యాంకు, అభ్యర్థికి వచ్చిన మా ర్కులను ప్రకటిస్తారు. నియామక పత్రాలను అందించిన తర్వాత మొత్తంగా ఆయా పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల హాల్‌టికెట్ నంబర్లు, రాతపరీక్షలో వారికి వచ్చిన మార్కులు, ఓవరాల్‌గా సాధించిన జనరల్ ర్యాంకులు, ఏ రిజర్వేషన్ క్యాటగిరీలో పోస్టులకు ఎంపికయ్యారు? తదితర వివరాలన్నింటి జాబితాను బోర్డు సైట్లో పొందుపరుస్తారు. కానిస్టేబుళ్ల నియామకాల కోసం ఇటీవల పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు రాతపరీక్షను నిర్వహించింది. ఆ వెంటనే ఫలితాలతోపాటు దాదాపు లక్షల మంది అభ్యర్థుల జీఆర్ఎల్ జాబితాను ప్రకటించింది. గ్రూప్-4 పోస్టులకు సంబంధించి టీజీపీఎస్సీ కూడా ఇదే విధానాన్ని పాటించింది. ఇవే కాకుండా అన్ని రిక్రూట్మెంట్ బోర్డులు సైతం అభ్యర్థుల తుదిఫలితాలతోపాటు జీఆర్‌ఎల్‌ను వెంటనే ప్రకటిస్తున్నాయి. 2018, 2019లో ట్రిబ్ సైతం ఈ విధానాన్ని పాటించింది. కానీ, ఇటీవల చేపట్టిన నియామకాలకు సంబంధించిన జీఆర్‌ఎల్‌ను మాత్రం నెలలు గడుస్తున్నా బహిర్గతం చేయడం లేదు. ప్రస్తుతం భర్తీ చేసిన పీజీటీ, పీడీ, లైబ్రేరియన్ పోస్టులు మినహా మిగతా పోస్టులకు సంబంధించిన అభ్యర్థులకు ఆ వివరాలను పూర్తిస్థాయిలో వెల్లడించలేదు. డీఎల్ పోస్టులకు సంబంధించి పేపర్-1, డెమో మార్కులను మాత్రమే అభ్యర్థుల ఐడీలో వెల్లడించింది. పేపర్-2 మార్కులను మాత్రం ఇప్పటికీ ప్రకటించలేదు. అదేవిధంగా జేఎల్, పీజీటీ పోస్టులకు సంబంధించి పేపర్-1, పేపర్-2, డెమో మార్కులను ప్రకటించినప్పటికీ పేపర్-3 మార్కులను ఐడీల్లో పొందుపరచలేదు. ఇక టీజీటీకి సంబంధించిన 3 పేపర్లలో ఒక్క పేపర్ మార్కులను కూడా అభ్యర్థుల వ్యక్తిగత ఐడీల్లో పొందుపరచకుండా పూర్తి గోప్యతను పాటిస్తున్నది.
గురుకుల పోస్టుల భర్తీకి ఎంపికైన అ భ్యర్థుల జాబితాను ప్రకటించడం మొదలుకొని ఆ తర్వాత సర్టిఫికెట్ల వెరిఫికేష న్, డెమోల నిర్వహణ వరకు ఏ ఒక్క అంశంలోనూ ట్రిబ్ పారదర్శకత పాటించలేదని అభ్యర్థులు గత 9 నెలల నుంచి ఆరోపిస్తున్నారు. ఒకే రోజులో అర్ధరాత్రి వరకు హడావుడిగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను నిర్వహించడంతో అనేక తప్పులు దొర్లాయని నిప్పులు చెరుగుతున్నారు. ఈ నియాకమ ప్రక్రియపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఇప్పటికే ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్, జేఎల్ బోటనీ, జువాలజీ, టీజీటీ, పీజీటీకి చెందిన అభ్యర్థు లు కోర్టులను ఆశ్రయించారు. ప్రస్తుతం ఆయా కేసుల విచారణ కొనసాగుతున్న ది. జీఆర్‌ఎల్‌ను ప్రకటిస్తే కేసుల సం ఖ్య మరింత పెరగవచ్చని, అందుకే వ్యక్తిగత ఐడీల్లో మార్కులను ప్రకటించేందుకు ట్రిబ్ జంకుతున్నదని తెలుస్తున్నది.