కాగజ్‌నగర్, సెప్టెంబర్ 23 : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని పెద్దవాగు సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్ర మాదంలో ఆర్టీఐ సామాజిక కార్యకర్త ఎండీ అజీమ్ (42) అక్కడికక్కడే మృతిచెందాడు. మరో కార్యకర్త, ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎండీ అశ్రాఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఆర్టీఐ సామాజిక కార్యకర్త ఎండీ అశ్రాఫ్, తన తమ్ముడు అజీమ్‌తో బైక్‌పై మంగళవారం ఆసిఫాబాద్ వైపు వెళ్తున్నాడు.
పెద్దవాగు సమీపంలో డీసీఎం వ్యాను వెనుక నుంచి ఢీకొట్టడంతో ఎదురుగా వస్తున్న లారీ కిందపడ్డారు. దీంతో అజీమ్ అక్కడికక్కడే మృతి చెందగా, అశ్రాఫ్కు కాలు విరిగింది. గమనించిన స్థానికులు ప్రైవేటు దవాఖానలో చేర్పించారు. అవినీతి అక్రమాలపై సమాచార హక్కుచట్టం ద్వారా ఎండీ అశ్రాఫ్, ఎండీ అజీ మ్ సమాచారం సేకరించడం.. సమాచారం ఇవ్వని అధికారులపై రాష్ట్రస్థాయి ఆర్టీఐ కమిషన్ దృష్టికి తీసుకెళ్తుంటారు.
ఇటీవల రాష్ట్రస్థాయి ఆర్టీఐ కమిషన్ ఒకేరోజు 980 ఆర్టీఐ పెండింగ్ కేసులు విచారణ చేపట్టేందుకు సిద్ధమవగా, అందుకు నిరాకరించినట్టు తెలిసింది. సమాచార హక్కు చట్టం ద్వారా అవినీతి, అక్రమాలు వెలుగులోకి తీసుకురావడం వల్లే కావాలనే ఎవరో వ్యానుతో ఢీకొట్టి యాక్సిడెంట్‌గా చిత్రీకరించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అశ్రాఫ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కాగజ్‌నగర్ రూరల్ సీఐ కుమారస్వామి తెలిపారు.