RTC Strike | హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 22 నుంచి సమ్మెకు దిగనున్నట్టు ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలు ప్రకటించారు. సోమవారం లేబర్ కమిషన్ జాయింట్ లేబర్ కమిషనర్ సునీతా గోపాల్‌దాస్ నేతృత్వంలో చర్చలకు సమావేశం నిర్వహించారు. ఈ చర్చలకు ఆర్టీసీ యాజమాన్య సంస్థ నుంచి అధికారులెవరూ రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మిక జేఏసీ సమ్మె తేదీని ప్రకటించింది. కార్మికులు, ఇతర కార్మిక సంఘాలు ఐక్యంగా సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, యాజమాన్యం వైఫల్యంతో దిక్కుతోచని స్థితిలోనే సమ్మెకు వెళ్తున్నామని వెల్లడించింది.
ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రి నుంచే ఎక్కడి బస్సులు అక్కడే డిపోలకు పరిమితం కావాలని పిలుపునిచ్చింది. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో సర్కార్ పూర్తిగా విఫమైందని జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ అధికారులను సమ్మె చర్చలకు పంపి.. వారిని సముదాయించడంలోనూ విఫలమైందని మండిపడుతున్నారు. దీంతో కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో రెండోసారి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నెల 22వ తేదీ నుంచి ఆర్టీసీలో సమ్మె చేపడుతున్నామని, కార్మికులు, ఇతర కార్మిక సంఘాలు ఐక్యంగా సమ్మెను విజయవంతం చేయాలని జేఏసీ పిలుపునిచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, యాజమాన్య వైఫల్యం కారణంగా గత్యంతరం లేకే సమ్మెకు పిలుపునిచ్చామని ఆర్టీసీ కార్మిక జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న వెల్లడించారు. చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ఈ సమ్మె నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మార్చి 13న సమ్మె నోటీసు ఇచ్చామని, కార్మికుల సూచన మేరకు ఇచ్చిన సమ్మె నోటీసుపై నెల రోజులు ఆగినా.. ప్రభు త్వం, ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం చొరవ తీసుకోలేదని ధ్వజమెత్తారు. ఆర్టీసీ కార్మిక సమస్యలు తమ పరిధిలో లేవని, వాటిని పరిషరించలేమని, అవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని పేర్కొంటూ సోమవారం నాటి చర్చలకు హాజరుకాని ఆర్టీసీ యాజమాన్యం తప్పించుకునే ప్ర యత్నం చేసినట్టు ఆరోపించారు. రోజుకు 16 గంటలకు పైగా విధులతో వెట్టిచాకిరీ చేయిస్తున్న యాజమాన్యానికి కార్మిక సమస్యలు పరిషరించాలనే ఆలోచనే లేదని మండిపడ్డారు.
ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీ నం, యూనియన్ల ఎన్నికల అంశాలపై కమిటీ వేసినట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడుతూ చెప్పారని వెంకన్న తెలిపారు. అసలు మీరు ఆ కమిటీ ఎప్పుడు వేశారు? ఆ కమిటీకి చైర్మన్ ఎవరు? సభ్యులెవరు? ఆ కమిటీ కాపీ ఉంటే తమకు పంపాలని వెంకన్న కోరారు. ఆ కమిటీ అంశంపై కార్మికులతోపాటు తెలంగాణ సమాజానికి కూడా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ యాజమాన్యమే సమ్మె జరుపడానికి తమను ఉసిగొలిపేలా మొండివైఖరి ప్రదర్శిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల కోరిక మేరకు ఏప్రిల్ 22న మొదటి డ్యూటీ నుంచే ఆర్టీసీ సమ్మె జరుగుతుందని ప్రకటించారు. తమ వెనుక 40 వేల మంది కార్మికులు ఉన్నారని స్పష్టంచేశారు. కొందరు కార్మిక ద్రోహుల మాటలు నమ్మి ప్రభుత్వం మరోలా ఆలోచిస్తే.. కచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదురోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సమ్మె నూరుశాతం విజయవంతం అవుతుందని స్పష్టంచేశారు.
ఏప్రిల్ 22వ తేదీ మొదటిది అంటే.. 21వ తేదీ అర్ధరాత్రి తర్వాత మొదలయ్యే ఫస్ట్ డ్యూటీకే సమ్మె మొదలవుతుందని, కార్మిక వర్గమంతా సమ్మెకు సిద్ధంగా ఉండాలని జేఏసీ వైస్ చైర్మన్ ఎం థామస్‌రెడ్డి పిలుపునిచ్చారు. కార్మికుల డిమాండ్లపై, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని స్థితిలో ఇటు ప్రభుత్వం, అటు యాజమాన్యం ఉన్నదని ఆరోపించారు. మంత్రి వేశానంటున్న కమిటీ జీవో నంబర్ చెప్పాలని, ఆ జీవో విడుదల తేదీని తెలుపాలని ప్రశ్నించారు. కార్మికుల పొట్టలుగొట్టడానికి ఇలా ఎన్ని అబద్ధాలు ఆడుతారని నిలదీశారు. మ్యానిఫెస్టోలో ఉన్న విలీన అంశం, కార్మిక సంఘాల పునరుద్ధరణ అంశాలపై సర్కార్ నిర్ణయమేమిటి? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తారా? చేయరా? అ పాయింటెడ్ డే ఇస్తామని చెప్పి ఎందుకు పారిపోతున్నారు? అపాయింట్ డే ఇస్తా రా? ఇవ్వరా? రెండు పీఆర్సీలు ఎప్పుడిస్తారు? అంటూ ప్రశ్నలు వేశారు.
‘ఆర్టీసీ కార్మికులారా సమ్మెకు సిద్ధం కండి’ అని ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలు మౌలానా, కత్తుల యాదయ్య, సురేశ్ తదితరులు పిలుపునిచ్చారు. ఎలక్ట్రిక్ బస్సులతో ఆర్టీసీని అన్యాక్రాంతం చేసేందుకు ప్రభుత్వం, యాజమాన్యం కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు. ఈవీ బస్సులను తీసుకొచ్చి ఆర్టీసీని బయటకు పంపడానికి జరిగే కుట్రను ప్రతి కార్మికుడూ గమనించాలని కోరారు. ఇప్పటికే దాదాపు 5,000 మంది డ్రైవర్లను పక జోన్లకు పంపించే ప్రయత్నం జరుగుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
గ్యారేజీ కార్మికులను కన్వర్షన్లో వెళ్లపోవాలని బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. తమ డిమాండ్లు సాధించుకొని విజయం పొందే వరకూ ఆర్టీసీ కార్మికులు జేఏసీ పోరాటాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 32 అంశాలపై సమ్మె నోటీస్ ఇస్తే, కేవలం 5 అంశాలపై లేఖ ఇచ్చిన యాజమాన్యం కార్మికులకు ఏం న్యాయం చేస్తుందని ప్రశ్నించారు. చావో రేవో తేలే వరకూ కొట్లాడుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు, భారీ సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.