హైదరాబాద్ : ఆర్టీసీ ఉద్యోగుల, కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 10న నిర్వహిస్తున్న ఆర్టీసీ కార్మిక గర్జనను విజయవంతం చేయాలని టీజీఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు సోమవారం ఆర్టీసీ జేఏసీ ( RTC JAC ) అత్యవసర సమావేశమై ప్రభుత్వ వైఖరినీ తప్పుపట్టింది.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఆర్టీసీలో ఏడు సంవత్సరాలుగా కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆరోపించారు. ఎన్నిసార్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదని వెల్లడించారు. ఒకపక్కన ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఆర్టీసీ స్థలాలను ప్రైవేట్ యాజమాన్యానికి తాకట్టు పెడుతూ, మరోపక్క రీ ఆర్గనైజేషన్ యాక్ట్ 2014 కు తూట్లు పొడుస్తుందని మండిపడ్డారు.
బస్ భవన్లో సగభాగాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆక్రమించే ప్రయత్నంపై జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకపక్క గ్రేటర్ హైదరాబాద్ జోన్లో ఉన్న కార్మికులను కరీంనగర్, హైదరాబాద్ జోన్లకు బదిలీలు చేసే ప్రక్రియ చేపడుతూనే మరోప్రక్క మల్టీ ట్రేడ్ సిస్టంను తీసుకువచ్చి ఆర్టీసీ కార్మికులను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని వెల్లడించారు.
జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చిన కారణంగా లేని సమస్యలను కార్మికుల ముందుకు తీసుకువచ్చి కార్మికుల మనోస్థైర్యాన్ని దెబ్బ తీసే విధంగా ప్రభుత్వ, యాజమాన్యాలు మైండ్ గేమ్ ఆడుతున్నాయని ఆరోపించారు. సమస్యల పరిష్కారానికి సమ్మెలోకి వెళ్లడం ఖాయమని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్ రెడ్డి, కన్వీనర్ , ఎండీ మౌలానా, కో కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్, యాదగిరి అన్నారు.