కరీంనగర్ తెలంగాణచౌక్, ఆగస్టు 26 : ఆర్టీసీ కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ ఆర్టీసీ కార్మిక విభాగమైన స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం కరీంనగర్ బస్టాండ్‌లో నిరసనకు దిగారు. అంతకుముందు యూనియన్ రాష్ట్ర వైస్ చైర్మన్, జిల్లా ఇన్చార్జి జక్కుల మల్లేశం ఆధ్వర్యంలో ఆర్ఎం కార్యాలయం ఎదుట నిరసనకు దిగగా.. పోలీసు, సెక్యూరిటీ గార్డులు అనుమతి ఇవ్వలేరు.
తమ ప్రభుత్వ పాలనలో శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటురన్నారని వన్ టౌన్ సీఐ సిరిలాల్తో వాగ్వాదానికి దిగారు. సమస్యలను ఆర్ఎం దృష్టికి తీసుకెళ్లేందుకు మూడు నెలలుగా ప్రయత్నిస్తున్నా అనుమతి ఇవ్వడంలేదని, అందుకే నిరసన చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం జక్కుల మల్లేశం మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ అధికారులు కార్మికులను వేధిస్తున్నారని ఆరోపించారు.
డ్యూటీ చార్ట్‌లో సంతకం చేయకముందే బ్రీత్ ఎనలైజర్ టెస్టులు చేస్తున్నారని, మద్యం సేవించకపోయినా ఘగర్, బీపీ మందులు వాడినప్పుడు బ్రీత్ ఎనలైజర్ టెస్టులో పర్సంటేజీ చూపెడితే డ్రైవర్లను సస్పెండ్ చేస్తున్నారని వాపోయారు. తమ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.