నెట్వర్క్ నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 23: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలుచేయాలని, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారం రాష్ట్రవ్యాప్తంగా రెండోరోజూ కొనసాగింది. నిర్బంధాల నడుమ ఆర్టీసీ కార్మికులు నిరసనలు తెలిపారు. మండుటెండల్లోనూ ఉద్యోగులు ధర్నాలు, ర్యాలీలు చేపట్టారు. పలుచోట్ల కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. పలువురిపై కేసులు నమోదు చేశారు. ఆర్టీసీ సమ్మెకు బీఆర్ఎస్ నాయకులు, వివిధ ట్రేడ్యూనియన్లు మద్దతు ప్రకటించాయి.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 9 డిపోల పరిధిలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కల్వకుర్తి డిపో వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. కార్మికులకు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. కల్వకుర్తి డిపో ఎదుట జరిగిన ఘటనలో ఇద్దరిపై కేసులు పెట్టారు. ఉమ్మడి వరంగల్‌లో పోలీసులు భారీగా మోహరించాయి. భూపాలపల్లి డిపో నుంచి బస్సులు బయటికి రాకుండా కార్మికులు అడ్డుకున్నారు. మహబూబాబాద్ డిపోలో పలు బస్సులను నడిపించారు. బోధన్, కామారెడ్డిలో నిరసనలు కొనసాగాయి. కరీంనగర్ రీజియన్ పరిధిలో శాంతియుతంగా ధర్నాలు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సమ్మె కొనసాగింది. సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్ డిపోల్లోని కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు.
నారాయణఖేడ్ పోలీసులు టెంట్‌ను తొలగించారు. మెదక్, నర్సాపూర్ డిపోల వద్ద సమ్మె చేపట్టారు. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ డిపోల వద్ద కార్మికులు సమ్మె చేపట్టారు. సిద్దిపేటలో వంటావార్పు చేపట్టి నిరసన తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉద్యోగులు విధులు బహిష్కరించారు. డిపో నుంచి కుమ్రం భీం చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. భైంసాలోనూ సమ్మె కొనసాగింది. మంచిర్యాల బస్టాండు ఆవరణలో నిరసన వ్యక్తంచేశారు. మణుగూరులో 8 మందిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
భైంసా బస్ డిపో ఎదుట బస్సులు బయటకు తీసేందుకు ప్రయత్నించడంతో కండక్టర్ భోజన్న ‘సార్ మీ కాళ్లు మొక్కుతా.. మా బాధను అర్థం చేసుకోండి’ అని పోలీసులను వేడుకున్నాడు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో కండక్టర్ నెహ్రూ.. ‘సార్ మీ కాళ్లు మొక్కుతం.. మాకు సహకరించండి’ అని డీఎస్పీ వెంకట్‌రెడ్డి కాళ్లమీద పడి వేడుకున్నాడు. బోధన్‌లో ఓ ఉద్యోగి బస్సుకు అడ్డంగా పడుకున్నాడు. జనగామలో కార్మికులను పక్కకు తప్పించేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో ‘సార్ మీకు దండం పెడుతాం.. కాళ్లు మొక్కుతాం.. మమల్ని అడ్డుకోవద్దు’ అంటూ శ్రీనివాస్ అనే కార్మికుడు పోలీసులకు దండంపెట్టి.. కాళ్లు పట్టుకొని వేడుకున్నాడు. కామారెడ్డిలో ఎండ తీవ్రతతో ఓ కార్మికుడు సొమ్మసిల్లి పడిపోయాడు. కొల్లాపూర్‌లో కార్మికుడు బస్సుకు అడ్డంగా పడుకొని నిరసన తెలిపాడు. తొర్రూరు డివిజన్ కేంద్రంలో 28 మంది కార్మికులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలిపింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆర్టీసీ విలీన ప్రక్రియను పూర్తిచేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. కోరుట్లలో ఎమ్మెల్యే సంజయ్, మెదక్‌లో పద్మాదేవేందర్‌రెడ్డి సమ్మెకు మద్దతు తెలిపారు. మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి నర్సాపూర్‌లో, యాదగిరిగుట్టలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, నార్కట్‌పల్లిలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, ఖమ్మంలో ఎమ్మెల్సీ తాతా మధు, మధిరలో లింగాల కమల్‌రాజు, సత్తుపల్లిలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఇల్లెందులో దిండిగాల రాజేందర్, నాగర్‌కర్నూల్‌లో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మద్దతు ప్రకటించారు. హనుమకొండలో బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ఏఐటీయూసీ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. నారాయణఖేడ్‌లో మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, జహీరాబాద్‌లో ఎమ్మెల్యే మాణిక్‌రావు సంఘీబావం తెలిపారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాములు మద్దతు ప్రకటించారు.
వికారాబాద్ జిల్లా తాండూరు పోలీసులు పట్టణంలోని టెంట్‌హౌస్, ఫంక్షన్ హాళ్ల ఓనర్లకు గురువారం నోటీసులు అందజేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్నందున ఇది ప్రభుత్వ వ్యతిరేక చర్యగా పరిగణిస్తున్నట్టు పేర్కొన్నారు. సమ్మె కోసం టెంట్‌హౌస్, ఫంక్షన్‌హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు ఇస్తే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులో హెచ్చరించారు. టెంట్ అద్దెకిచ్చిన ఎఫ్ఎం టెంట్‌హౌస్ ఓనర్‌పై కేసు నమోదు చేశారు.