హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆర్టీసీ భూములను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పనంగా గుంజేసుకుంటున్నాయి. ముషీరాబాద్ నియోజకవర్గంలోని జమిస్తాన్‌పూర్‌లో దాదాపు 6 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల కోసం తీసుకున్నట్టు స్పష్టమవుతున్నది. ఇదేవిధంగా కాచిగూడ ఆర్టీసీ డిపో పరిధిలోని భూముల్లో 13 ఎకరాలను రైల్వే పనుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై ఆర్టీసీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఫోన్ల ద్వారా ఆర్టీసీ ఉన్నతాధికారుల వివరణ కోరేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నిస్తున్నప్పటికీ ఎవరూ స్పందించడం లేదు. దీంతో దీని వెనుక ఏదో గూడుపుఠాణి నడుస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వ్యవహారంపై గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తుం గతుర్తిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మా ట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఎకరం భూమి రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు ఉంటుందని, పేదల కోసం ఇండ్లు నిర్మించేందు కు ఆర్అండ్బీ, ఆర్టీసీ, హౌసింగ్ బోర్డు స్థలాలను వినియోగిస్తుంటే విపక్ష నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పుకొచ్చారు. తద్వారా ఇందిరమ్మ ఇండ్ల కోసం ఆర్టీసీ స్థలాలను వినియోగిస్తున్నట్టు స్వయంగా బట్టబయలు చేశారు.
ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి అధికారికంగా ఎంపికైన నాలుగు కొత్త ప్రాంతాల్లో జమిస్తాన్పూర్లోని ఆర్టీసీ క్వార్టర్స్ స్థలం ఒకటని ప్రభుత్వం ప్రకటించింది. దీనితోపాటు ఎల్బీనగర్ పరిధిలోని ఆమన్‌గల్, గోషామహల్ పరిధిలోని నాంపల్లి, చాంద్రాయణగుట్ట పరిధిలోని బండ్లగూడలో ఒకోచోట 480 చొప్పున మొత్తం 1,920 ఇండ్లను నిర్మించేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది. తెలంగాణ హౌసింగ్ బోర్డు కూడా ముషీరాబాద్ నియోజకవర్గాన్ని ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమంలో చేర్చింది. దీంతో జమిస్తాన్పూర్లోని ఆర్టీసీ క్వార్టర్స్ స్థలాన్ని ఇందిరమ్మ ఇండ్లకు తీసుకోవడంపై ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆస్తుల నుంచి ఇంకా విభజన కాని ఈ స్థలాన్ని రేవంత్‌రెడ్డి సర్కార్ ఎలా తీసుకుంటుందో అర్థం కావడం లేదని కార్మిక సంఘాల నేతలు అంటున్నారు.
కాచిగూడ రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం ఆ స్టేషన్ ఎదురుగా ఉన్న ఆర్టీసీ భూముల్లో 13 ఎకరాలు తీసుకుంటామన్న రైల్వేశాఖ ప్రతిపాదన సైతం ఇప్పటికే కార్యరూపం దాల్చినట్టు తెలిసింది. ఇలా వందల కోట్ల రూపాయల విలువైన భూములను ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు రైల్వేశాఖ లాక్కుంటున్నా ఆర్టీసీ యూనియన్లు కిక్కురుమనడం లేదు. కేవలం ఒకట్రెండు యూనియన్లు మాత్రమే ప్రభుత్వ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, కానీ ఆర్టీసీ భవిష్యత్ అవసరాల కోసం గతంలో కేటాయించిన భూములను ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి వినియోగించడం సరికాదని ఆ సంఘాల నేతలు అంటున్నారు. ఆర్టీసీ భూములను కాపాడుకునేందుకు అవసరమైతే అన్ని సంఘాలను కలుపుకొని ఉద్యమిస్తామని ఎస్‌డబ్ల్యూఎఫ్, టీఎంయూ (థామస్‌రెడ్డి) సంఘాలు హెచ్చరించాయి.
ఆర్టీసీకి చెందిన విలువైన భూములను తీసుకుంటే భవిష్యత్తులో సంస్థకు ఇబ్బందులు తలెత్తుతాయని ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఆర్టీసీ ఆస్తులను కాపాడాలి.. మా భూములు మాకే కావాలి’ అని స్పష్టం చేస్తున్నారు. ఆ భూముల విషయంలో ఆర్టీసీ బోర్డు ఏ నిర్ణయం తీసుకున్నది? ఇందిరమ్మ టవర్స్ కోసం మొత్తం ఎన్ని ఎకరాలు వెళ్తున్నాయి? రైల్వేశాఖకు ఎన్ని ఎకరాలు ఇస్తున్నారు? వాటి విలువ ఎంత? అనే ప్రశ్నలకు ఆర్టీసీ అధికారులు అధికారికంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ భూములను కాపాడుకోలేని యూనియన్లకు ఈసారి గుర్తింపు సంఘం ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని భావిస్తున్నారు.