హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): పెండింగ్ సమస్యల పరిష్కారంతోపాటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు మరో పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆదివారం బాగ్‌లింగంపల్లిలో జరిగిన టీజీఎస్ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, థామస్‌రెడ్డి తమ ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు.
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియను పూర్తిచేయడంతోపాటు కార్మికులకు బకాయిలతో సహా రెండు పీఆర్సీలు చెల్లిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు, సదుపాయాలు కల్పిస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రేవంత్ సర్కారును కోరా రు. అధునాతన సౌకర్యాలతో కొత్త సర్వీసులు ప్రారంభిస్తామని, యూనియన్లను పునరుద్ధరిస్తామని, కార్మికులను పీఆర్సీ పరిధిలోకి తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. 9 నెలలు గడుస్తున్నా ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు.
రేవంత్ సర్కా రు తీరును ఎండగడుతూ ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 10న డిమాండ్స్ డే బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వర్తిస్తామని, అక్టోబర్ 1న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద సామూహిక దీక్ష నిర్వహిస్తామని వెంకన్న, థామస్‌రెడ్డి తెలిపారు.