హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు ఆర్టీసీ కార్మికుల(RTC workers) సమ్మె కొనసాగుతున్నది. పోలీసుల పహారా మధ్య బలవంతంగా అద్దె బస్సులను నడిపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా ఆర్టీసీ కార్మికులు ఎక్కడి కక్కడ అడ్డుకుంటున్నారు. తాజాగా జనగామ జిల్లాలో నిరసనకు దిగిన ఆర్టీసీ కార్మికులను అడ్డుకోవద్దంటు ఓ ఆర్టీసీ కార్మికుడు పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకున్న సంఘటన ప్రతి ఒక్కరిని కదలించింది.
జనగామ ఆర్టీసీ డిపో ఎదుట సీఐ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నడుమ జనగామ డిపో నుండి వివిధ ప్రాంతాలకు బస్ కు ఒక కానిస్టేబుల్ను పెట్టి పంపిస్తున్నారు. ఈ క్రమంలో న్యాయమైన తమ డిమాండ్ల కోసం రోడ్డెకిన తమను అడ్డుకోవద్దంటూ పోలీసుల కాళ్లు మొక్కి వేడుకున్నాడు. కాగా, డిమాండ్స్ నెరవేర్చే వరకు సమ్మె ఆపేదే లేదని ఆర్టీసీ కార్మికులు స్పష్టం చేస్తున్నారు.