హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తేతెలంగాణ): ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. సోనియాగాంధీ పుట్టిన రోజు నాటికి సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో ప్రత్యక్ష పోరాట కార్యాచరణకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించాయి. 5న సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం అంశంతో సంబంధం లేని 11 అంశాలను ముందుగా పరిష్కరించాలని తేల్చిచెప్పాయి.
విలీనంతో సంబంధం ఉన్న మరికొన్ని అంశాలను పరిష్కరించాల్సి ఉందని, ఆయా అంశాలపై తీసుకునే నిర్ణయాల్లో కార్మిక సంఘాలను భాగస్వామ్యం చేయాలని డిమాండ్ చేశాయి. సాంకేతిక సమస్యలతో జరిగే చిన్నచిన్న పొరపాట్లకు కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని, వెంటనే వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈ వెంకన్న, వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఆర్టీసీలో కార్మిక సంఘాల ఉనికి లేదు. వాటి స్థానంలో డిపోల్లో ఉద్యోగుల ఆధ్వర్యంలో సంక్షేమ మండళ్లు ఏర్పాటు చేసి ఆయా అంశాలు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లే బాధ్యతను అప్పగించింది. దీంతో వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలన్న లక్ష్యంతో కార్మిక సంఘాలు ఒత్తిడి పెంచుతున్నాయి. కార్మిక సంఘాలకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఇటీవల ఓ సంఘం సీఎంకు సీఐటీయూ ప్రతినిధుల ద్వారా వినతిపత్రం అందజేయాల్సి వచ్చింది.