ఖైరతాబాద్, జూలై 11 : తమను విధుల్లోకి తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలతో ఉద్యమిస్తామని ఆర్టీసీ సస్పెండెడ్, రిమూవ్డ్ ఎంప్లాయీస్ ప్రతినిధి యలమర్తి ప్రసాద్‌రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ నుంచి వివిధ కారణాలతో 1,100 మంది సస్పెన్షన్, తొలగింపునకు గురై రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై ప్రభుత్వంతో పోరాడితే త్రీమెన్ కమిటీ వేసిందని, ఆ కమిటీ సిఫారసు మేరకు జీవో-282 జారీ చేసి తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించిందని పేర్కొన్నారు. కానీ, సంస్థ ఎండీ సజ్జనార్ ప్రభుత్వానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఆ జీవో అమలుకాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
తాము కలిసేందుకు ప్రయత్నిస్తే నిరాకరిస్తున్నట్టు తెలిపారు. జీవో అమలుపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ను అడిగితే రేపు, మాపు అంటూ తిప్పించుకుంటున్నారని చెప్పారు. ఓ అధికారి ద్వారా ప్రభుత్వ జీవోను అమలు చేయించలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేసే కుట్ర జరుగుతున్నదని, సంస్థను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తక్షణమే జీవో ప్రకారం తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాజేందర్, భాగేశ్వర్, గంగాధర్, రమేశ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.