గౌలిగూడ బస్టాండ్.. నేటి తరానికి పెద్దగా పరిచయం లేని ఈ బస్టాండ్ ఒకప్పుడు హైదరాబాద్ వాసులకు చిరపరిచితం. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా ప్రయాణికులు ఈ బస్టాండ్‌కు చేరుకునేవారు. నిజాముల కాలంనాటి ఈ బస్టాండ్ ఆ తర్వాత క్రమంగా ప్రాభవం కోల్పోయినప్పటికీ దాని పేరు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం పుణ్యమాని మళ్లీ ఈ బస్టాండ్ పేరు తెరపైకి వచ్చింది. ఆర్థికంగా తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్న సర్కార్ ఈ బస్టాండ్‌ను తాకట్టుపెట్టినట్టు ఊరువాడా కోడై కూస్తున్నది.
TGSRTC | హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ సంస్థ పీకల్లోతు నష్టాలోకి కూరుకుపోయింది. కాంగ్రెస్ సభల్లో ఈ పథకం గురించి ఎంతో గొప్పగా చెప్తున్న ప్రభుత్వ పెద్దలు, అదే స్థాయిలో ఆర్టీసీకి ఆ పథకం నిధులు విడుదల చేయకపోవడంతో పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయింది. దీంతో సంస్థను బతికించుకునేందుకు, ఉద్యోగులను కాపాడుకునేందుకు ఆర్టీసీ సంస్థ తన ఆస్తులను అమ్ముకునేందుకు సిద్ధమైనట్టు విశ్వసనీయంగా తెలిసింది.
వేతనాలకు కూడా ఇబ్బందులు తలెత్తుండటంతో ప్రతినెలా ఆర్టీసీ సంస్థ యాజమాన్యం ప్రభుత్వం దగ్గర ‘దేహీ’ అని వేడుకుంటున్నది. ఇటీవల వేతనాలు కూడా సరిగా ఇవ్వలేని స్థితికి ఆర్టీసీ చేరుకోవడంతో కార్మికులందరూ ఏకమై సంస్థపై అంతర్గత యుద్ధం ప్రకటించారు. దీంతో ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ప్రభుత్వానికి పరిస్థితిని వివరించడంతో ప్రతినెలా వేతనాలు ఆలస్యం కాకుండా నిధులు తీసుకొస్తున్నారు. అంతే తప్ప, ఉచిత బస్సు ప్రయణానికి సంబంధించిన డబ్బులు మాత్రం ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్టు తెలిసింది.
ఉచిత బస్సు దెబ్బకి ఆర్టీసీ తీవ్ర నష్టాల్లోకి జారుకోవడం, ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి, పీఎఫ్, సీసీఎస్, ఎస్ఆర్బీఎస్ నిధులు చెల్లించడానికి డబ్బులు లేకపోవడంతో ఇటీవల గౌలిగూడ బస్టాండ్‌ను తాకట్టు పెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆర్టీసీకి ఇవ్వాల్సిన గ్రాంట్లు, లోన్లను అనధికారికంగా రేవంత్ సరారు రద్దు చేయడంతో కార్మికులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ సైతం ఇవ్వలేకపోతున్నది.
దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో, నష్టాల ఊబి నుంచి కొంతవరకైనా బయటపడేందుకు నగరంలోని గౌలిగూడ బస్టాండ్ స్థలాన్ని రూ. 400 కోట్లకు తనఖా పెట్టారని వినికిడి. ఆ డబ్బుతో ఉద్యోగ విరమణ చేసిన వారికి ఆర్థిక పరమైన సెటిల్మెంట్లు చేయాలని యోచిస్తున్నది. ఇప్పటికే సీసీఎస్ నుంచి వాడుకున్న నిధులను తిరిగి జమ చేయలేదని, పీఎఫ్ బకాయిల చెల్లింపులు పూర్తిగా జరగడం లేదని ఆర్టీసీ కార్మికులు రోజూ సంస్థ ఆఫీసుల చుట్టూ తిరుగు తూ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు.
గతంలో ఆర్టీసీ అవసరాలకు ప్రభుత్వ పూచీకత్తుతో రుణాలు పొందే విధానం ఉండేది. కొంతకాలంగా ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిమితిని దృష్టిలో ఉంచుకుని పూచీకత్తు ఇవ్వడానికి వెనకాడుతున్నది. దీంతో ఆర్టీసీనే సొంతంగా రుణాలు సమకూర్చుకోవాల్సి వస్తున్నది. ఈ క్రమంలోనే గౌలిగూడ పాత బస్టాండ్ స్థలాన్ని తనఖా పెట్టడానికి సిద్ధమైంది. ఈ బస్టాండ్ భాగ్యనగర చారిత్రక కట్టడాల్లో ఒకటి. ప్రస్తుతం సిటీ సర్వీసులు నిలిపే స్థలంగా వినియోగంలో ఉంది. దీని పకనే హైదరాబాద్ డిపో ఉంటుంది. ఆర్టీసీకి సంబంధించిన కొన్ని ఇతర నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపి దాదాపు 5.8 ఎకరాల విస్తీర్ణంలో ఉంటాయి. ఈ స్థలాన్ని కొల్లేటరల్ సెక్యూరిటీగా ఉంచిన ఆర్టీసీ హడో నుంచి రూ.400 కోట్ల రుణాన్ని తీసుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. సంస్థలో పెండింగులో ఉన్న ముఖ్యమైన పనులు పూర్తి చేసేందుకు ఈ నిధులు సేకరించినట్టు సమాచారం.
ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు, కార్మికుల నెల వేతనాలకు రూ. 300 కోట్లకు పైగా నిధులు అవసరం. దాదాపు రూ.85 కోట్ల వరకు ప్రతినెలా లోన్లకు కట్టాలి. రూ. 8 కోట్ల వరకు డీజిల్‌కే పోతున్నాయి. అద్దె బస్సులకు నెలకు సుమారు రూ.2.50 కోట్లు చెల్లింపు, ఉద్యోగుల పీఎఫ్, సీసీఎస్‌లకు మరో రూ.40 కోట్ల వరకు అవసరం అవుతున్నాయి. ఇతర మెయింటనెన్స్ ఖర్చులు కలిపితే, ఆర్టీసీకి ఆదాయం కంటే నష్టమే ఎక్కువని చెప్తున్నారు. ఆర్టీసీ నుంచి వచ్చే ఆదాయం ప్రతినెలా రూ.300 కోట్లకు కూడా మించకపోవడం, ప్రభుత్వం ప్రతినెలా ‘మహాలక్ష్మి ఉచిత ప్రయాణం’ కింద అందాల్సిన రూ.300 కోట్లు సకాలంలో అందకపోవడంతో ఆర్టీసీ యాజమాన్యం కూడా నానా తంటాలు పడుతున్నది. ఇప్పటికిప్పుడు ఆర్టీసీకి ఎలాంటి అప్పులు లేకుండా ఉండాలంటే కనీసం రూ.11వేల కోట్లు అవసరమని కార్మిక సంఘాల నేతలు చెప్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఫ్రీ బస్సు పథకం ఆర్టీసీ పాలిట శాపంగా మారిందని మొదట్నుంచి కార్మిక సంఘాలు, ఆర్టీసీ సంస్థ ఉద్యోగులు అంతర్గతంగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఈ పథకం ఆర్టీసీని నష్టాల ఊబిలో పడేస్తుందని అందరూ భావించినట్టే ఇప్పుడు జరుగుతున్నదని అంటున్నారు. లాభాలు లేక, మరోవైపు ప్రభుత్వం సమయానికి జీరో టికెట్ నిధులు విడుదల చేయక ఆర్టీసీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నది.
మరోవైపు రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపులో జాప్యం జరుగుతుండటంతో వారు రోడ్డెకి నిరసనలు వ్యక్తం చేసేందుకు సిద్ధమయ్యారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలని ఆర్టీసీని ఆదేశించింది. ఇక సీసీఎస్, పీఎఫ్‌కు సంబంధించి హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి. దీంతో మొదట రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం కోసం, ఆర్థిక పరమైన కొన్ని అంశాలను చక్కదిద్దుకునేందుకు తక్షణం డబ్బులు అవసరం కావడంతో ఆస్తులు అమ్మకానికి తెగబడినట్టు తెలిసింది. దీనిపై ఆర్టీసీ యాజమాన్యం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.