కవాడిగూడ, జూన్ 12: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని టీజీఎస్ఆర్టీసీ బహుజన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకు అపాయింట్మెంట్ తేదీని ప్రకటించాలని కోరారు. ఆధార్ కార్డు తరహాలో ప్రయాణికులకు ఆర్టీసీ ఐడీ కార్డు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం టీజీఎస్ఆర్టీసీ బహుజన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సురేశ్ మాట్లాడుతూ ఎంవీ యాక్ట్ 1961ని ఆర్టీసీలో అమలు చేయాలని కోరారు. ఆర్టీసీలో సస్పెండ్, రిమూవ్ అయిన కార్మిక సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ అయిన వారికి బకాయిలు చెల్లించాలని, 2017కు సంబంధించిన పే స్కేలు, అలవెన్స్లు పెంచాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు బీ నాగేశ్వర్, యాదయ్య, ఎం లీలారావు, రవి కిరణ్, బీ శ్రీనివాస్, సీహెచ్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.