హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో దశాబ్దాలపాటు పనిచేసి, ఉద్యోగ విరమణ చేసిన కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ రిటైర్డ్ కార్మికులు, ఉద్యోగులు శుక్రవారం డిపోల ముందు చేపట్టిన ధర్నా విజయవంతమైంది. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) ఆధ్వర్యంలో తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా వేల మంది కార్మికులు ధర్నాకు దిగారు. హైదరాబాద్‌లోని బస్‌భవన్ వద్ద జరిగిన ధర్నాలో ఎస్‌డబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు, ప్రచార కార్యదర్శి పీఆర్ రెడ్డి, కార్యదర్శి జీఆర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ఏవీ రావు మాట్లాడుతూ.. 2017 పీఆర్సీ బకాయిలను చెల్లించాలని, 2022 నుంచి రావల్సిన టెర్మినల్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ ఇవ్వాలని, రిటైర్డ్ ఉద్యోగులతోపాటు, వారి జీవిత భాగస్వాములు ఉచితంగా సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణించేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. వీటితోపాటు రిటైర్డ్ కార్మికుల సమస్యలను వెంటనే పరిషరించాలని కోరారు. మహబూబ్‌నగర్‌లో ఎస్‌డబ్ల్యూఎఫ్ అధ్యక్షుడు వీరాంజనేయులు, వరంగల్ రీజియన్‌లో ఎల్లయ్య, సీహెచ్. రాంచందర్, ఆదిలాబాద్‌లో ఉపాధ్యక్షుడు ఎంబీ రావు, కరీంనగర్లో మల్లయ్య, శ్రీనివాస్, ఖమ్మంలో రీజియన్ కార్యదర్శి సుధాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏవీ రావు తదితరులు ధర్నాకు నాయకత్వం వహించారు. అనంతరం ప్రధాన ఆఫీసుల్లో ఆర్టీసీ ఎండీ, ఓఎస్డీ భాను ప్రసాద్‌తోపాటు అన్ని డిపో కార్యాలయాల్లో వినతిపత్రాలు సమర్పించారు.